
స్మిత్ అజేయ శతకం
మూడో వన్డేలో ఆసీస్ విజయం
పెర్త్: కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (104 బంతుల్లో 108 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సహాయంతో పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే కెరీర్‌లో తొలి వన్డే ఆడిన పీటర్ హ్యాండ్స్ కోంబ్ (84 బంతుల్లో 82; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఆసీస్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 22న నాలుగో వన్డే సిడ్నీలో జరుగుతుంది. తొలుత పాక్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 263 పరుగులు చేసింది.
బాబర్ ఆజమ్ (100 బంతుల్లో 84; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజెల్‌వుడ్‌కు మూడు, హెడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఆసీస్ 45 ఓవర్లలో మూడు వికెట్లకు 265 పరుగులు చేసి నెగ్గింది. 45 పరుగులకు రెండు వికెట్లు పడిన దశలో స్మిత్, హ్యాండ్స్ కోంబ్ జోడి అదరగొట్టింది. మూడో వికెట్‌కు ఏకంగా 183 పరుగులు జోడించారు. ఆమిర్, జునైద్, హసన్ లకు ఒక్కో వికెట్ దక్కింది.