శ్రీకాంత్ ఐదో‘సారీ’...
కౌలూన్ (హాంకాంగ్): బ్యాడ్మింటన్ సీజన్‌లో చివరి సూపర్ సిరీస్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో భారత క్రీడాకారులు చేతులెత్తేశారు. బరిలోకి దిగిన అందరూ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, 21వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్, 25వ ర్యాంకర్ అజయ్ జయరామ్... మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు... మహిళల డబుల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ జంట గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్పలకు పరాజయం తప్పలేదు.
ఈ సీజన్‌లో తనకు కొరకరాని కొయ్యగా మారిన చైనా ప్లేయర్ తియాన్ హువీ అడ్డంకిని అధిగమించడంలో భారత నంబర్‌వన్ శ్రీకాంత్ ఐదోసారీ విఫలమయ్యాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ శ్రీకాంత్ 16-21, 21-15, 22-24తో ప్రపంచ పదో ర్యాంకర్ తియాన్ హువీ చేతిలో ఓడిపోయాడు. గంటా 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను వదులుకోవడం గమనార్హం.
పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 17-21, 12-21తో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో... ప్రణయ్ 15-21, 21-18, 6-21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు.
సింధు పరాజయం
ఇక మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధుకు పరాజయం తప్పలేదు. ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 17-21, 9-21తో ఓడిపోయింది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో మారిన్‌ను బోల్తా కొట్టించిన సింధు ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 12-21, 15-21తో జంగ్ క్యుంగ్ యున్-షిన్ సియెంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓడిపోయింది.