దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ టాప్‌కు చేరాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కినెట్టాడు. ప్రస్తుతం 904 రేటింగ్ పాయింట్లతో స్మిత్ ప్రథమ స్థానానికి చేరగా, కోహ్లి 903 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో టాప్‌ను స్మిత్‌కు చేజార్చుకోవాల్సి వచ్చింది. చతేశ్వర పుజారా నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.
యాషెస్ సిరీస్‌లో నాల్గో టెస్టుకు స్మిత్ ఫిట్ కావడంతో అతను నంబర్ వన్ ర్యాంకును మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది. యాషెస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్న తరుణంలో స్మిత్ మరోసారి బ్యాట్ ఝుళిపిస్తే మరిన్ని రేటింగ్ పాయింట్లతో టాప్‌ను కాపాడుకుంటాడు. 2018 ఆగస్టులో చివరిసారి నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన స్మిత్.. ఆపై నిషేధం కారణంగా టాప్‌ను కోల్పోయాడు. కాగా, యాషెస్ సిరీస్ ద్వారా టెస్టుల్లో పునరాగమనం చేసిన స్మిత్ ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో రెండు వరుస సెంచరీలు సాధించిన స్మిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. అటు తర్వాత గాయం కారణంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌కు, మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు.
Comments
Please login to add a commentAdd a comment