వారు బుద్ధి హీనులు: అనుష్క శర్మ
న్యూఢిల్లీ:అనుష్క శర్మ... ఇటీవల కాలంలో తరచు నెటిజన్ల ఆగ్రహానికి గురైన బాలీవుడ్ నటి. గతంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ కోల్పోవడానికి అనుష్క శర్మనే కారణమంటూ నెటిజన్లు మండిపడ్డారు. కోహ్లికి అనుష్క గర్ల్ ఫ్రెండ్ కావడం వల్లే అతను పేలవమైన ఫామ్ లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు పోటెత్తాయి. అయితే తమ స్నేహాన్ని తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిన కామెంట్లు గురించి అనుష్క మరోసారి ఘాటుగా స్పందించింది. అసలు ఆ తరహా కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదంటూనే వారిపై మండిపడింది.
'వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లి ఆటపై సోషల్ మీడియాలో నన్నే టార్గెట్ చేస్తూ విమర్శలు రావడం చాలా దురదృష్టకరం. ఆ కామెంట్లు నాపై ఎటువంటి ప్రభావం చూపవు. అలా ఒకర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేది కేవలం బుద్ధి హీనులు మాత్రమే. ఆ రకంగా నాపై వ్యాఖ్యలు చేసిన వారికి ఏదొక చెడ్డ రోజు వస్తుంది. వారు కూడా నాలానే బాధ పడక తప్పదు. అయినా నాపై వచ్చిన కామెంట్లకు పదే పదే స్పందిచాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ కేర్' అని అనుష్క స్పష్టం చేసింది.