రామ్‌కుమార్ శుభారంభం | Somdev Devvarman Crashes Out of First Round in Chennai Open | Sakshi
Sakshi News home page

రామ్‌కుమార్ శుభారంభం

Published Wed, Jan 6 2016 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

రామ్‌కుమార్ శుభారంభం

రామ్‌కుమార్ శుభారంభం

 సోమ్‌దేవ్‌కు చుక్కెదురు
 చెన్నై ఓపెన్ టోర్నీ
 చెన్నై:
సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో భారత యువ టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్‌లో రెండో గొప్ప విజయాన్ని సాధించాడు. చెన్నై ఓపెన్‌లో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 248వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6-2, 6-0తో ప్రపంచ 98వ ర్యాంకర్ డానియెల్ గిమెనో ట్రావెర్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించాడు. టాప్-100లోని క్రీడాకారుడిని ఓడించడం రామ్‌కుమార్‌కిది రెండోసారి మాత్రమే.
 
  గతేడాది ఇదే టోర్నీలో అప్పడు 90వ ర్యాంక్‌లో ఉన్న సోమ్‌దేవ్‌ను రామ్‌కుమార్ ఓడించాడు. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఈ చెన్నై ఆటగాడు రెండో రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో తలపడతాడు. మరోవైపు క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. సోమ్‌దేవ్ 3-6, 6-3, 3-6తో రష్యాకు చెందిన 18 ఏళ్ల ఆండ్రీ రుబ్‌లెవ్ చేతిలో ఓడిపోయాడు.
 
 క్వార్టర్స్‌లో పేస్ జంట
 పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో పేస్-గ్రానోలెర్స్ ద్వయం 6-2, 6-3తో తారో డానియల్ (జపాన్)-జాన్ మిల్‌మన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జంట 3-6, 7-6 (7/2), 7-10తో టాప్ సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement