నాకు నమ్మకం ఉంది: గంగూలీ
ముంబై: దాదాపు మూడేళ్ల తరువాత భారత క్రికెట్ వన్డే జట్టులోకి స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ పునరాగమనం. ఇంగ్లండ్పై మంచి రికార్డు కల్గి ఉండటంతో ఆ జట్టుతో తలపడే టీమిండియా వన్డే, ట్వంటీ 20 జట్టుల్లో యువీకి చోటు దక్కింది. ఆ జట్టుపై మొత్తం 34 వన్డేలాడిన యువీ 48.62 సగటుతో 1313 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2007లో తొలిసారి జరిగిన వరల్డ్ ట్వంటీ 20లో ఇంగ్లండ్ పై యువీ విరుచుపడ్డాడు. ప్రత్యేకంగా స్టువర్ట్ బ్రాడ్ ఓవర్ లో ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలచి సత్తా చాటాడు. ఇంగ్లండ్ వర్సెస్ భారత్ అంటే.. యువీ ఆడిన ఆ ఇన్నింగ్స్ ప్రతీ ఒక్క అభిమానికి గుర్తుకు రావడం ఖాయం. యువరాజ్ ఎంపికపై అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు చివరకు అతనికి రెండు ఫార్మాట్లలో చోటు కల్పించారు.
ఇదిలా ఉంచితే, యువరాజ్ సింగ్ ను తిరిగి జట్టులోకి తీసుకోవడం పట్ల మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. అతని రెండు ఫార్మాట్లలో ఎంపిక చేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనదిగా గంగూలీ పేర్కొన్నాడు. 'యువరాజ్కు జట్టులో చోటు కల్పించడం నిజంగా మంచి పరిణామమే. రెండు ఫార్మాట్లలో యువీని ఎంపిక చేసి అతనిపై విశ్వాసం ఉంచారు. నాకు కూడా యువీపై అపారమైన నమ్మకం ఉంది. ఇంగ్లండ్తో సిరీస్లో యువరాజ్ కచ్చితంగా రాణిస్తాడు. రాబోవు సిరీస్ లో యువరాజ్ విజయవంతం అవుతాడని ఆశిస్తున్నా'అని గంగూలీ మద్దతుగా నిలిచాడు.
మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీ వదులుకున్న తర్వాత యువీ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. యువీ ఎంపికపై విరాట్ కోహ్లి కూడా సానుకూలంగా స్పందించడంతో అతని ఎంపికకు మార్గం సుగుమైంది. 2013 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన యువీ చివరిసారి వన్డేల్లో కనిపించగా, వరల్డ్ టీ 20లో భాగంగా 2016 మార్చిలో ఆసీస్ తో చివరి ట్వంటీ 20 ఆడాడు. ఆ తరువాత యువరాజ్ జట్టులో ఎంపిక కావడం ఇదే తొలిసారి.