
'ఆ సిరీస్ లోనే వారు నమ్మకాన్ని కోల్పోయారు'
జోహన్నెస్బర్గ్:ఇటీవల భారత్లో జరిగిన టెస్టు సిరీస్ దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ఆత్మ విశాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసిందని ఆసీస్ మాజీ కోచ్ మికీ ఆర్ధర్ అభిప్రాయపడ్డాడు. ఆ క్రికెట్ సిరీస్ లో దక్షిణాఫ్రికా 0-3 తేడాతో వరుస పరాజయాలను ఎదుర్కొవడంతో వారిని ఆత్మరక్షణలో పడేలా చేసిందన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో సఫారీల ఘోర ఓటమికి కూడా భారత్ లో ఎదురైన పరాభవమే కారణమన్నాడు.
అసలు భారత్ లోని పిచ్లపై స్పిన్ ను ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. గతంలో తాను ఆసీస్ కోచ్ గా ఉన్న సమయంలో 0-4 తేడాతో భారత్ కు సిరీస్ కు అప్పగించిన విషయాన్నిఈ సందర్భంగా ఆర్ధర్ గుర్తు చేసుకున్నాడు. అప్పడు ఆసీస్ ఎలా అయితే పరాజయం పాలైందో.. ఇప్పుడు సఫారీలకు అదే తరహా అనుభవం ఎదురైందన్నాడు. ఆ ఓటములనుంచి దక్షిణాఫ్రికా బయటకు వచ్చి ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆర్ధర్ జోస్యం చెప్పాడు.