క్లీన్ స్వీప్తో 'టాప్' లేపారు! | South Africa Complete Clean Sweep Over Sri Lanka, Reclaim No.1 ODI Ranking | Sakshi
Sakshi News home page

క్లీన్ స్వీప్తో 'టాప్' లేపారు!

Published Sat, Feb 11 2017 10:58 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

క్లీన్ స్వీప్తో 'టాప్' లేపారు! - Sakshi

క్లీన్ స్వీప్తో 'టాప్' లేపారు!

శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా క్లీన్స్వీప్ చేసింది.

సెంచూరియన్:శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 5-0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో సఫారీలు తన వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ స్థానానికి చేరారు. ఇప్పటివరకూ ప్రథమ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును వెనక్కినెట్టిన దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆసీస్ కంటే దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లు వెనుకబడి వుంది. అయితే ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా 0-2 తో ఓటమి పాలైంది. అదే సమయంలో శ్రీలంకను దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. 2014 తరువాత వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా నంబర్ వన్ స్థానానికి చేరడం ఇదే తొలిసారి.



ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విసిరిన  385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంకేయులు 296 పరుగులకే పరిమితమై ఓటమి పాలయ్యారు. దాంతో వన్డే సిరీస్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని శ్రీలంక తన పర్యటనను ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 384 పరుగులు నమోదు చేసింది. హషీమ్ ఆమ్లా(154),డీకాక్(109) శతకాలు చేయడంతో పాటు,డు ప్లెసిస్(41), బెహర్దియన్(32)లు బ్యాట్ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక పోరాడి ఓటమి పాలైంది. గుణరత్నే(114), పతిరానా(56)లు రాణించినా జట్టును పరాజయం నుంచి  గట్టెక్కించలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement