వాకాలో 'రికార్డు' స్కోరు!
పెర్త్: ఆస్ట్రేలియాతో ఇక్కడ వాకా గ్రౌండ్లో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పరుగుల మోత మోగించింది. 390/6 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 540/8 వద్ద డిక్లేర్ చేసింది. ఇది వాకా గ్రౌండ్లో దక్షిణాఫ్రికా జట్టుకు రెండో ఇన్నింగ్స్ రికార్డు స్కోరుగా నమోదైంది. అంతకుముందు 2008-09లో ఇక్కడ దక్షిణాఫ్రికా నమోదు చేసిన 414 పరుగులే ఇప్పటి వరకూ ఆ జట్టుకు అత్యధిక స్కోరు.
ఈ మ్యాచ్లో ఓవర్ నైట్ ఆటగాళ్లు డీ కాక్, ఫిలిండర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. డీకాక్(64), ఫిలిండర్(73) రాణించడంతోపాటు అంతకుముందు డీన్ ఎల్గర్(127), డుమినీ(141)లు శతకాలు నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. దాంతో ఆసీస్కు 539 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు నిర్దేశించారు. ఈ రోజు ఆటలో లంచ్ కు ముందే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తుందని భావించినా, కాస్త ఆలస్యంగా డిక్లేర్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్కు రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే లభించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆసీస్ కనుక ఈ లక్ష్యాన్ని ఛేదించినట్లయితే టెస్టు చరిత్రలో కొత్త రికార్డును తిరగరాస్తుంది.