ఆసీస్ ఢమాల్
పెర్త్: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల రికార్డు విజయలక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఆస్ట్రేలియా 177 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 169/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 361 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి ఎదుర్కొంది. ఓవర్ నైట్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా(97) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా 195 పరుగుల వద్ద ఉండగా మిచెల్ మార్ష్(26) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అయితే ఆ తరువాత నేవిల్ తో కలిసి ఖవాజా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడి ఆరో వికెట్ కు 50 పరుగులు జోడించిన తరువాత ఖవాజా అవుటయ్యాడు. దాంతో ఆసీస్ ఓటమి ఖరారైంది. కాగా, చివర్లో టెయిలెండర్లతో కలిసి నేవిల్(60 నాటౌట్) ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టడంతో దక్షిణాఫ్రికా విజయం కాసేపు ఆలస్యమైంది. చివరి వికెట్లతో కలిసి హాఫ్ సెంచరీ సాధించిన నేవిల్.. అజేయం క్రీజ్ లో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా ఐదు వికెట్లు సాధించగా,ఫిలిండర్, డుమనీ, బావుమా,మహారాజ్లకు తలో వికెట్ దక్కింది.