కేప్‌టౌన్: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించిన శ్రీలంక వన్డేల్లో మాత్రం దక్షిణాఫ్రికా ధాటికి తలవంచింది. ఆడిన ఐదు వన్డేల్లోనూ ఓడి 0–5తో వైట్‌వాష్ అయింది. ఈ రెండేళ్లలో లంక పరాభవానికి గురైన నాలుగో వన్డే సిరీస్ ఇది. శనివారం రాత్రి జరిగిన ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట లంక 49.3 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (56; 3 ఫోర్లు) రాణించాడు. సఫారీ బౌలర్లలో రబడ 3, నోర్జి, తాహిర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 28 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
ఈ దశలో మైదానంలోని ఫ్లడ్‌లైట్లలో ఒకటి మొరాయించింది. దాంతో సరైన వెలుతురు లేకపోవడంతో మిగతా ఓవర్లు సాధ్యపడలేదు. అప్పటికి డకవర్త్ లూయిస్ లెక్కల ప్రకారం దక్షిణాఫ్రికా విజయానికి 95 పరుగులు చేస్తే సరిపోయేది. విజయలక్ష్యం కంటే దక్షిణాఫ్రికా స్కోరు ఎక్కువగా ఉండటంతో వారి విజయం ఖాయమైంది. మార్క్‌రమ్ (67 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. కెప్టెన్ డు ప్లెసిస్ 24 పరుగులు చేయగా, డసెన్ 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మార్క్‌రమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment