దక్షిణాఫ్రికా తడబాటు | South Africa's batsmen were restricted | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా తడబాటు

Published Thu, Jun 8 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

దక్షిణాఫ్రికా తడబాటు

దక్షిణాఫ్రికా తడబాటు

ఆదుకున్న డేవిడ్‌ మిల్లర్‌ 
రాణించిన పాక్‌ బౌలర్లు


బర్మింగ్‌హామ్‌: పాకిస్తాన్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీ తడబడింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓ వైపు ప్రత్యర్థి పేస్‌కు, స్పిన్‌కు సహచరులు బెంబేలెత్తుతుంటే డేవిడ్‌ మిల్లర్‌ (104 బంతుల్లో 75 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్సర్లు) మొండిగా పోరాడాడు.

నిప్పులు చెరిగే బంతులతో హసన్‌ అలీ 3, జునైద్‌ ఖాన్‌ 2 వికెట్లు తీయగా, స్పిన్నర్‌ వసీమ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి 8 ఓవర్ల వరకు బాగానే ఉన్నా... తొమ్మిదో ఓవర్‌ నుంచి దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో 40 పరుగుల వరకు ఒక్క వికెట్‌ కోల్పోని జట్టు... ఆ తర్వాత చేసిన మరో 78 పరుగుల వ్యవధిలో ఏకంగా 6 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు ఆమ్లా (16), డికాక్‌ (49 బంతుల్లో 33; 2 ఫోర్లు) మొదలుకొని... డు ప్లెసిస్‌ (26), కెప్టెన్‌ డివిలియర్స్‌ (0), డుమిని (8) అంతా పాక్‌ పేస్, స్పిన్‌కు కుదేలయ్యారు. దీంతో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మోరిస్‌ (28), రబడ (26) అండతో మిల్లర్‌ జట్టును గట్టెక్కించాడు. చిచ్చర పిడుగల్లే చెలరేగే మిల్లర్‌ తన స్వభావానికి విరుద్ధంగా నింపాదిగా ఆడాడు. 83 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన మిల్లర్‌ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క ఫోర్‌ ఉండగా, మూడు సిక్సర్లున్నాయి.

ఊరించే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్‌ వర్షం వల్ల మ్యాచ్‌ నిలిచే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్లకు 119 పరుగులు చేసింది. క్రీజులో బాబర్‌ ఆజమ్‌ (31), షోయబ్‌ మాలిక్‌ (16) ఉన్నారు. వర్షం వల్ల మిగతా ఆట సాధ్య పడకపోవడంతో డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement