జాక్వస్ కలిస్
డర్బన్: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచిన దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్ కలిస్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. నేటి (గురువారం) నుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టు అతని కెరీర్‌లో చివరిది కానుంది. అయితే 38 ఏళ్ల కలిస్ వన్డేల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో ఇటీవలి కాలంలో ముగ్గురు ప్రముఖ క్రికెటర్లు అంతర్జాతీయ టెస్టుల నుంచి తప్పుకున్నట్టయ్యింది. ఇంతకుముందే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 1995 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కలిస్ సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఓ దశలో సచిన్ అత్యధిక టెస్టు సెంచరీలు అధిగమించే సత్తా ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటిదాకా కెరీర్‌లో 165 టెస్టులు ఆడి 13 వేల 174 పరుగులు సాధించాడు. ఇందులో 44 సెంచరీలు ఉండడం విశేషం. అంతేకాకుండా బౌలర్‌గానూ రాణించి 292 వికెట్లు తీసి 199 క్యాచ్‌లు అందుకొని తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పాడు. టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు.
గౌరవంగా భావిస్తున్నాను...
‘18 ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో కొనసాగుతుండడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మైదానంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించగలిగాను. అయితే ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. నిజానికి ఇది చాలా కఠిన నిర్ణయం. ముఖ్యంగా ఆసీస్‌పై అన్నిచోట్లా సాధించిన విజయాలతో సంతోషంగా ఉన్నాను. దీన్ని నేను వీడ్కోలుగా భావించడం లేదు. ఒకవేళ నేను ఫిట్‌నెస్ కలిగి ఉండి ప్రదర్శన బాగుంటే 2015 ప్రపంచకప్‌ను జట్టుకు అందించాలనుకుంటున్నాను. గత రెండేళ్ల నుంచి అద్భుత ఆటగాళ్లతో కలిసి నా ప్రయాణం సాగింది. ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్ల మధ్య కెరీర్ ముగిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను’
- కలిస్
అసలు సిసలు ఆల్‌రౌండర్
టాప్ ఆర్డర్‌లో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా జట్టుకు పెద్ద దిక్కు... కొత్త బంతితో స్ట్రైక్ బౌలర్‌గా ప్రత్యర్థిని కట్టడి చేయగల సామర్థ్యం... సమకాలీన క్రికెట్‌లో పరిపూర్ణ ఆల్‌రౌండర్ అనగల ఏకైక క్రికెటర్ కలిస్. గ్యారీ సోబర్స్ తర్వాత టెస్టుల్లో 8 వేల పరుగులు చేసి 200 వికెట్లు తీసిన ఆటగాడిగా ఘనత సాధించిన కలిస్ దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.
‘సచిన్, పాంటింగ్‌లకంటే ప్రభావవంతమైన క్రికెటర్’ అంటూ ఇటీవలే అతని గురించి సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించడం కలిస్ గొప్పతనానికి నిదర్శనం. టెస్టుల్లో 13 వేలకు పైగా పరుగులు, దాదాపు 300 వికెట్లు అంటే సాధారణ విషయం కాదు. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోని కలిస్ ఆ తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2000లో భారత గడ్డపై 2-0తో జట్టుకు సిరీస్ అందించి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలవడంతో కలిస్ సత్తా ప్రపంచానికి తెలిసింది.
2003-04 సీజన్‌లో వరుసగా ఐదు టెస్టుల్లో సెంచరీలు చేసి బ్రాడ్‌మన్ తర్వాత నిలవడం విశేషం. 2005లో కలిస్ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. తన 150వ టెస్టులో 150కి పైగా పరుగులు చేసిన ఒకే ఒక క్రికెటర్ కలిస్. ఈ ఏడాది ఆడిన 7 టెస్టుల్లో 17.63 సగటుతో కేవలం 194 పరుగులే చేయడంతో కలిస్ టెస్టుల్లో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. 18 ఏళ్ల కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన డర్బన్‌లోనే ఈ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ తన ఆఖరి టెస్టు కూడా ఆడనున్నాడు.
- సాక్షి క్రీడావిభాగం
టెస్టు కెరీర్‌గ్రాఫ్
ఆడిన మ్యాచ్‌లు: 165
ఇన్నింగ్స్: 279
చేసిన పరుగులు: 13,174
ఆడిన బంతులు: 28,587
అత్యధిక స్కోరు: 224
సగటు: 55.12
స్ట్రయిక్ రేట్: 46.08
సెంచరీలు: 44
అర్ధ సెంచరీలు: 58
ఫోర్లు: 1475
సిక్సర్లు: 97
క్యాచ్‌లు: 199
వేసిన బంతులు: 20,166
ఇచ్చిన పరుగులు: 9,499
తీసుకున్న వికెట్లు: 292
సగటు: 32.53
అత్యుత్తమ బౌలింగ్: 6/54