2018.. భారత్‌ ఆట.. పతకాల వేట | Sports News 2018 Flashback | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 27 2018 5:12 PM | Last Updated on Thu, Jan 3 2019 9:09 PM

Sports News 2018 Flashback - Sakshi

ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల మెరుపులు అడపాదడపా కనిపించేవి. కానీ కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వేదిక ఏదైనా.. ప్రత్యర్థులు ఎవరైనా దీటుగా బదులిస్తూ.. వారిని బోల్తా కొట్టిస్తూ.. అద్వితీయ ప‍్రదర్శనతో అదరగొడుతూ.. మనోళ్లు నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది కంటే మెరుగ్గా అద్భుత ఫలితాలు నమోదు చేశారు. భారత క‍్రీడారంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రధానంగా ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ సాధించిన పతకాలే అందుకు నిదర్శనం. ఇండోనేసియా వేదికగా జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ 69(15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు) పతకాలు సాధించింది. ఓవరాల్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అలానే మరికొన్ని ప్రముఖ ఈవెంట్లలో సైతం భారత్‌ సత్తా చాటి పతకాల వేటను కొనసాగించింది. వాటిలో కొన్నింటిని ఓ లుక్కేద్దాం.

1. పీవీ సింధు: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ లో భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు సాధించింది. ఫలితంగా బ్యాడ్మింటన్‌ టోర్నీని బంగారు పతకంతో ముగించింది. ఈ సీజన్‌లో ఆమెకు ఇదే తొలి టైటిల్‌ కాగా, అంతకుముందు వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌, ఏషియన్‌ గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ టోర్నీల్లో రజత పతకాలు సాధించింది. ఇక థాయ్‌లాండ్‌ ఓపెన్‌, ఇండియా ఓపెన్‌లలో సైతం సింధు రజత పతకాల్ని సాధించింది. ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి ఘనతను సింధు సొంతం చేసుకుంది. 

2. సైనా నెహ్వాల్‌: ఈ ఏడాది మరో మహిళా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ సైతం మంచి ఫలితాల్ని సాధించింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు ఏషియన్‌ గేమ్స్‌, ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా చూస్తే నాలుగు టోర్నీల్లో(కామన్వెల్త్‌ గేమ్స్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, ఇండోనేసియా ఓపెన్‌, సయ్యద్‌ మోదీ) సైనా ఫైనల్‌కు చేరింది.

3. సైనా-కశ్యప్‌ల వివాహం: భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న సైనా-కశ్యప్‌లు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో డిసెంబర్‌14వ తేదీన వివాహం చేసుకున్నారు. రిజిస్టర్‌ వివాహం చేసుకున్న ఈ జంట.. ఆపై ఘనంగా హెచ్‌ఐసీసీలో రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు క్రీడా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు.  

4. సమీర్‌వర్మ: ఈ సీజన్‌లో భారత షట్లర్‌ సమీర్‌ వర్మ సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను సాధించాడు. లక్నోలో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చైనాకు చెందిన లు గాంగ్‌జును ఫైనల్లో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ రన‍్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి హన్‌ యు చేతిలో సైనా ఓటమి పాలైంది.  

5. అంగద్‌ వీర్‌ సింగ్‌ బజ్వా: ఆసియా షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌ స్కీట్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ అంగద్‌ వీర్‌ సింగ్‌ బజ్వా ప్రపంచ రికార్డు స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. కాంటినెంటల్‌, ప్రపంచస్థాయి స్కీట్‌ ఈవెంట్లలో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్‌గా అంగద్‌ రికార్డులకెక్కాడు. కువైట్‌ సిటీ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్ ఫైనల్‌ రౌండల్‌ అంగద్‌ 60కి 60 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.  10 మీటర్ల రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత జోడి ఎలవెనిల్‌ వలరివాన్‌-హ్రిదయ్‌ హజరికాలు గోల్డ్‌ సాధించారు. 

6. స్వప్న బర్మన్‌:  ఏషియన్‌ గేమ్స్‌లో 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్‌ సాధించింది. ఇండోనేసియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది.  హై జంప్‌, జావెలిన్‌ త్రోలలో టాపర్‌గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్‌పుట్‌ , లాంగ్‌ జంప్‌ లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులోనాలుగో స్థానంలో, 200మీ. పరుగులో సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్‌... నాలుగో స్థానంలో నిలిచినా మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది.

7. అర్పిందర్‌ సింగ్‌:  ఆసియా క్రీడల్లో భాగంగా ట్రిపుల్ జంప్‌లో భారత జంపర్ అర్పిందర్ 16.77 మీటర్ల దూరం దూకి స్వర్ణంతో మెరిశాడు. కనీసం ఈ పోటీల్లో జాతీయ రికార్డును సవరిస్తే చాలు అనుకున్న అర్పిందర్ ఏకంగా పసిడిని పట్టేయడం విశేషం. దీంతో ఈ విభాగంలో 48 ఏండ్లుగా ఊరిస్తు వస్తున్న స్వర్ణ ఆశలకు తెరదించాడు. 2014 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒక్క పతకం కూడా గెలువని అర్పిందర్.. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పసిడిని సాధించి అందరినీ అబ్బురపరిచాడు. 

8. తేజిందర్‌ పాల్‌ సింగ్: ఆసియా క్రీడల్లో షాట్‌పుట్‌ ఈవెంట్‌లో పోటీపడిన తేజిందర్‌పాల్ సింగ్ స్వర్ణాన్ని సాధించాడు. రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఇలా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందజేశాడు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్‌ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. దీంతో ఒత్తిడికి గురైన తేజిందర్ మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో మాత్రం మళ్లీ 19.96 మీటర్లు విసిరి మునుపటి లయని అందుకున్నాడు. ఐదోసారి కసితో ఆడి ఆసియా క్రీడల్లోనే రికార్డు నెలకొల్పేలా గుండును 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు.

9. రోహన్‌ బోపన్న–దివిజ్‌ శరణ్‌ జోడికి స్వర్ణం: ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్‌ బోపన్న–దివిజ్‌ శరణ్‌ (భారత్‌) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలెగ్జాండర్‌ బుబ్‌లిక్‌–డెనిస్‌ యెవ్‌సెయెవ్‌ (కజకిస్తాన్‌) ద్వయంపై గెలుపొందిన బోపన్న–శరణ్‌ జోడి పసిడి సాధించింది. ఫలితంగా తమ కెరీర్‌లో ఏషియాడ్‌ డబుల్స్‌ స్వర్ణాన్ని తొలిసారి సొంతం చేసుకుంది. 

10. వుషూలోనూ మెరిశారు: ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల వుషూ ఈవెంట్‌లో భారత్‌ నాలుగు కాంస్య పతకాల్ని సాధించింది. ఇది ఏషియన్‌ గేమ్స్‌ వుషూ చరిత్రలో భారత్‌కు ఇది అత్యుత్తమ ప‍్రదర్శన. అంతకుముందు 2014లో రెండు క్యాంస పతకాల్ని మాత్రమే సాధించగా.. ఈసారి దాన్ని మరింత మెరుగుపరుచుకుంది. వుషూలో పతకాలు సాధించిన వారిలో  రోషిబినా దేవీ(60 కేజీల కేటగిరీ), సంతోస్‌ కుమార్‌(56 కేజీల కేటగిరీ), సూర్య భాను ప్రతాప్‌ సింగ్‌(60 కేజీల కేటగిరీ), నరేందర్ గ్రావెల్‌(65 కేజీల కేటగిరీ)లు ఉన్నారు. 

11. సెపక్‌తక్రా: ఆసియాగేమ్స్‌ సెపక్‌తక్రాలో ఈవెంట్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఆసియాగేమ్స్‌లో భాగంగా భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌ చేతిలో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ గేమ్స్‌ చరిత్రలో సెపక్‌తక్రా క్రీడాంశంలో భారత్‌ కనీసం కాంస్య పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి.

12. వినేశ్‌ ఫొగాట్‌: ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్‌ చరిత్రలో వినేశ్‌ ఫొగాట్‌ రూపంలో తొలిసారి భారత వనిత పసిడి పట్టు పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్‌ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్‌ 50 కేజీల విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ విజేతగా నిలిచింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. 

13. బజరంగ్‌ పూనియా: ఆసియా క్రీడల్లో రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా గోల్డ్‌ సాధించాడు. 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్‌ రెజ్లర్‌ తకాతాని దైచిని ఓడించిన పూనియా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 

14. గోల్డెన్‌ జాన్సన్‌: ఆసియా క్రీడల్లో జిన్సన్‌ జాన్సన్‌  స్వర్ణం ఒడిసిపట్టాడు.1500 మీ. పరుగులో జాన్సన్‌ పసిడితో మెరిశాడు. 3 నిమిషాల 44.72 సెకన్లలో రేసు పూర్తి చేసి బంగారు పతకం అందుకున్నాడు. 800 మీటర్ల పరుగులో రజతంతో సంతృప్తిపడిన జాన్సన్‌...1500 మీ. పరుగులో మాత్రం అందరి కంటే ముందు లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని సాధించాడు.

15.జెరెమీ లాల్రిన్గుంగా: అర్జెంటీనా వేదికగా జరిగిన యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ టీనేజ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ సంచలనం జెరెమీ లాల్రిన్గుంగా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. వెయిట్‌లిఫ్టింగ్‌ పోరులో 15 ఏళ్ల లాల్రిన్గుంగా ఫైనల్‌ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడంతో పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. గ్రూప్‌-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్‌.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించాడు.  తొలుత స్నాచ్‌ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు.

16. తబాబి దేవి: యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి జూడోలో పతకం లభించింది. 44 కిలోల కేటగిరిలో తంగ్జమ్ తబాబి దేవి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సీనియర్ లేదా యూత్ స్థాయిలో పరంగా చూసిన జూడోలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 

17. దీపా కర్మాకర్‌: టర్కీలో జరిగిన జిమ‍్నాస్టిక్స్‌ వరల్డ్‌ చాలెంజ్‌కప్‌లో భారత జిమ్నాస్ట్‌ దీపాకర్మాకర్‌ స్వర్ణాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఈ గేమ్స్‌లో భారత్‌ తరపున పసిడి సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది. 

18. సునీల్‌ ఛెత్రి: జూన్‌ నెలలో జరిగిన ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ సాధించిన ఆటగాడిగా రెండోస్థానం పొందాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌తో లియోనల్ మెస్సీతో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. 

19.నవజ్యోత్‌ కౌర్‌: భారత మహిళా రెజ్లర్‌ నవజ్యోత్‌ కౌర్‌ కొత్త చరిత్ర లిఖించింది. కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది.

20. సానియా మీర్జాకు పుత్రోత్సాహం: అక్టోబర్‌ నెలలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పుత్రుడికి జన్మనిచ్చింది. సానియా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌లో వివాహం జరగ్గా.. ఈ ఏడాది ఆ దంపతులకు కొడుకు పుట్టాడు. ఆరు గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ గెలుచుకున్న 32 ఏళ్ల సానియా సుదీర్ఘ కాలం పాటు డబుల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగింది. 

21. సాక్షి మాలిక్: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సాక్షి మాలిక్‌(57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్‌ (క్రొయేషియా)పై  సాక్షి విజయం సాధించింది. 

22. మేరీకోమ్‌:  ముప్పై ఐదేళ్ల వయసు.. ముగ్గురు పిల్లల తల్లి అయినా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ తన ప్రదర్శనతో నిరూపించింది. నవంబర్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మేరికోమ్‌ పసిడి సొంతం చేసుకుంది. తద్వార ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ స్వర్ణంతో ఈ మణిపురి మణిపూస క్యూబా పురుషుల బాక్సింగ్‌ దిగ్గజం ఫెలిక్స్‌ సవాన్‌ సరసన చేరింది. ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి సొంతం చేసుకున్న మేరీ.. ఫిబ్రవరిలో జరిగిన స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో రజతం సరిపెట్టుకుంది. సెప్టెంబర్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేరికోమ్‌ను గిరిజనుల ప్రచారకర్తగా నియమించింది. ఇదే నెలలో పొలాండ్‌లో జరిగిన బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ కోసం నాలుగు గంటల్లో రెండు కిలోలు తగ్గి ఔరా అనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement