
పాక్ ఎదురీత
షార్జా: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ ఎదురీదుతోంది. అహ్మద్ షెహజాద్ (275 బంతుల్లో 147; 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నా... మిగతా బ్యాట్స్‌మెన్ సహకారం అందించలేకపోయారు. దీంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 95.3 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. మిస్బా (36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం పాక్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 19/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన పాక్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ మన్‌జూర్ (125 బంతుల్లో 52; 4 ఫోర్లు), షెహజాద్ నిలకడగా ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు.
అయితే మన్‌జూర్, అజహర్ అలీ (8), యూనిస్ ఖాన్ (17) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో పాక్ 189 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా, షెహజాద్ నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో షెహజాద్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. హెరాత్ 3, ఎరంగా 2, పెరీరా ఒక్క వికెట్ తీశాడు.