
జో రూట్ సెంచరీ
శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపు
ఐదో వన్డే
పల్లెకెలె: జో రూట్ సూపర్ సెంచరీ (117 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్)తో శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేను ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. 23 ఏళ్ల రూట్ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ కాగా అవన్నీ ఈ ఏడాదే రావడం విశేషం. ఇంగ్లండ్ తరఫున డేవిడ్ గోవర్ (1983లో) ఒక్కరే వార్షిక క్యాలెండర్‌లో నాలుగు సెంచరీలు సాధిం చాడు. బుధవారం శ్రీలంక 239 పరుగులకు ఆలౌట్ అయింది.
వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను రిజర్వ్ డే గురువారం ప్రారంభించారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 49.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నెగ్గింది. 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును రూట్ తనదైన శైలిలో ఆదుకున్నాడు. జేమ్స్ టేలర్ (90 బంతుల్లో 68; 5 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించిన రూట్ 115 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. సేనానాయకేకు రెండు వికెట్లు పడ్డాయి. ఇరు జట్ల మధ్య ఆరో వన్డే ఇదే మైదానంలో 13న జరుగుతుంది.