
రెండో టి20లో లంక గెలుపు
బ్యాటింగ్‌లో దుమ్మురేపిన శ్రీలంక... పాకిస్థాన్‌తో జరిగిన రెండో టి20లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకుంది.
దుబాయ్: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన శ్రీలంక... పాకిస్థాన్‌తో జరిగిన రెండో టి20లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్లకు 211 పరుగులు చేసింది. పెరీరా (59 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సంగక్కర (21 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దిల్షాన్ (33 బంతుల్లో 48; 8 ఫోర్లు), ప్రసన్న (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశారు. ఓపెనర్‌గా వచ్చిన పెరీరా... దిల్షాన్‌తో కలిసి తొలి వికెట్‌కు 100, సంగక్కరతో కలిసి మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించాడు. అజ్మల్‌కు 2 వికెట్లు దక్కాయి.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 187 పరుగులు మాత్రమే చేసి ఓడింది. షార్జిల్ ఖాన్ (25 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. తన్వీర్ (26 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్సర్), ఆఫ్రిది (13 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఓ దశలో 83/3 స్కోరుతో ఉన్న పాక్ ఏడు బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 85/7తో నిలిచింది. చివర్లో తన్వీర్, అజ్మల్ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్సర్) తొమ్మిదో వికెట్‌కు 63 పరుగులు జోడించినా ప్రయోజనం లేకపోయింది. టి20 క్రికెట్‌లో ఈ వికెట్‌కు ఇది రికార్డు భాగస్వామ్యం. సేననాయకే 3 వికెట్లు తీశాడు. పెరీరాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ఆఫ్రిదికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
భారత్ ర్యాంక్ 2
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్ (123) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. శ్రీలంక (129) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికా (123) మూడో స్థానంలో, పాకిస్థాన్ (121) నాలుగో స్థానంలో ఉన్నాయి.