
సాక్షి, సంగారెడ్డి: దుబాయ్‌లో జరుగనున్న ‘మాస్టర్స్ కప్ కబడ్డీ టోర్నీ’లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా సంగారెడ్డికి చెందిన ఎల్. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. శ్రీనివాస్ రెడ్డిని భారత కోచ్‌గా నియమించినట్లు భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది. ఈనెల 22 నుంచి 30 వరకు దుబాయ్‌లోని అల్‌వసల్ ఇండోర్ స్టేడియంలో మాస్టర్స్ కప్ కబడ్డీ టోర్నీ జరుగుతుంది.
ఇందులో భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, డెన్మార్క్, ఇరాన్, అర్జెంటీనా జట్లు తలపడుతున్నాయి. భారత జట్టుకు అజయ్ ఠాకూర్ (తమిళ్ తలైవాస్ స్టార్ రైడర్) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ సందర్భంగా భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్యకు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో జరుగనున్న ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లోనూ శ్రీనివాస్ రెడ్డి జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. గతంలో తెలుగు టైటాన్స్, హరియాణా స్టీలర్స్ జట్టుకు ఆయన సహాయక కోచ్‌గా ఉన్నారు. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా పనిచేశారు.