
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ స్వర్ణ పతక జోరు కొనసాగుతుంది. ఈ ఒక్క రోజే భారత్ ఖాతాలో 6 స్వర్ణ పతకాలు చేరాయి. తాజాగా పురుషుల కబడ్డీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో భారత్.. ఇరాన్‌పై 33-29 తేడాతో నెగ్గింది. ఏషియన్ గేమ్స్ పురుషుల కబడ్డీలో మొత్తంగా భారత్‌కు ఇది 8వ స్వర్ణం. ఈ పతకంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 28కి చేరింది. మొత్తంగా ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఇప్పటివరకు 103కు (28 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది.
ప్రస్తుతానికి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో దూసుకుపోతుంది. చైనా ఇప్పటివరకు 366 పతకాలు (193 స్వర్ణాలు, 107 రజతాలు, 66 కాంస్యాలు) సాధించింది. పతకాల పట్టికలో జపాన్ రెండో స్థానంలో (177; 48 స్వర్ణాలు, 62 రజతాలు, 67 కాంస్యాలు) ఉంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (183; 39 స్వర్ణాలు, 55 రజతాలు, 89 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది.