ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు... ఏం ఫర్వాలేదు! బోర్డులో గొడవలు, వర్గ పోరాటాలు... వచ్చే నష్టమేమీ లేదు!! సుప్రీం కోర్టులో కేసులు, లోధా కమిటీ పంచాయితీలు... ఆటకు సంబంధం లేని వ్యవహారాలు!!! గత కొన్నేళ్లలో భారత క్రికెట్‌కు సంబంధించి మైదానం బయటి వ్యవహారాలు, వివాదాలు, వార్తలు ఎన్నో ఎన్నెన్నో... కానీ ఇదంతా టీ కప్పులో తుఫాన్‌లాంటిదే తప్ప ఆటను కబళించే సునామీ అసలే కాదనేది క్రికెట్ ప్రపంచం గుర్తించిన సత్యం. కమాన్ ఇండియా అంటూ క్రికెట్‌లో లీనమైపోయే సగటు అభిమానికి కావాల్సింది మ్యాచ్ వినోదం మాత్రమే. భారత జట్టు విజయం సాధించడం... కోహ్లి పరుగుల వరద, భువీ వికెట్ల జాతర మాత్రమే!
క్రికెట్‌నే శ్వాసించే మన ఫ్యాన్స్ పిచ్చి ప్రేమే ఇప్పుడు బీసీసీఐకి కాసుల పంట పండిస్తోంది. సరిగ్గా ఈ అభిమానమే పెట్టుబడిగా కోటానుకోట్ల రూపాయల కాసులతో ప్రసారకర్తలు మరోసారి సిద్ధమైపోయారు. పైసాకు పైసా లాభం తెచ్చి పెట్టగల శక్తి క్రికెట్‌కే ఉందని వారు నమ్మారు. అందుకే భారత్ గడ్డపై వచ్చే ఐదేళ్లలో జరిగే 102 అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం స్టార్ ఇండియా సంస్థ ఏకంగా రూ. 6,138.10 కోట్లు చెల్లించనుంది. అంటే ఒక్కో మ్యాచ్‌కు రూ. 60.17 కోట్లు బోర్డు ఖాతాలో పడుతుంది. భారత క్రికెట్ విలువ కించిత్ కూడా తగ్గలేదని ఈ ఒప్పందం మరోసారి నిరూపించింది. గత సెప్టెంబర్‌లో ఐపీఎల్ హక్కులతో రూ.16,347.5 కోట్లు ఆర్జించిన బోర్డు ఖజానా ఇప్పుడు మరింత బరువెక్కింది!
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారహక్కుల కోసం జరిగిన పోటీలో మరోసారి స్టార్ ఇండియాదే పైచేయి అయింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ–వేలంలో తన ప్రత్యర్థులు సోనీ, రిలయన్స్ జియోలను వెనక్కి తోసి హక్కులను సొంతం చేసుకుంది. వేలంలో స్టార్ రూ. 6 వేల 138 కోట్ల 10 లక్షలకు హక్కులు గెలుచుకుంది. బుధవారం రూ. 6,032.5 కోట్ల వద్ద నిలిచిన వేలం గురువారం కూడా కొనసాగింది. మరో 105.5 కోట్లు అదనంగా పెరిగిన తర్వాత సోనీ, జియో సంస్థలు తమ వల్ల కాదంటూ పోటీ నుంచి తప్పుకున్నాయి. వేలంలో సోనీ రూ.6118.59 కోట్లు కోట్ చేసి ఇదే తమ గరిష్ట మొత్తంగా ప్రకటించేసింది. దాంతో మరింత ముందుకు వెళ్లిన స్టార్ విజేతగా నిలిచింది. దీని ప్రకారం వచ్చే ఐదేళ్లలో భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రపంచవ్యాప్త టీవీ ప్రసారాలు, డిజిటల్ ప్రసారాల గ్లోబల్ కన్సాలిడేటెడ్ బిడ్ (జీసీఆర్) స్టార్ సొంతమైంది. ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో ప్రసార హక్కుల కోసం స్టార్ రూ.3,851 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 59 శాతం ఎక్కువ విలువ పెరగడం మరో విశేషం. తాజా ఒప్పందం ప్రకారం స్టార్ ఒక్కో మ్యాచ్ కోసం బోర్డుకు రూ.60.17 కోట్లు చెల్లిస్తున్నట్లు లెక్క. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఐపీఎల్ హక్కులు కూడా ఉన్న స్టార్ గుత్తాధిపత్యంతో భారత క్రికెట్‌పై తమకు ఉన్న పట్టును మరింత పెంచుకుంది. ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ కోసం అదే స్టార్ రూ.54.5 కోట్లు చెల్లిస్తోంది. క్రికెట్‌లోని రెండు ‘అత్యంత విలువైన’ ప్రసార హక్కులతో పాటు ఐసీసీ టోర్నీల హక్కులు కూడా స్టార్ వద్దే ఉండటం విశేషం. తాజా ఒప్పందంలో భారత పురుషుల జట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు, పురుషుల దేశవాళీ టోర్నీల ప్రసార హక్కులు కూడా స్టార్‌కే చెందుతాయి.
ఐపీఎల్ ఆదాయం 50–50
ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే విషయంలో స్టార్, దూరదర్శన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. గురువారం ముగిసిన తుది భేటీ అనంతరం ప్రకటనలో ఆదాయాన్ని చెరి సగం పంచుకునేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి. ఏ రకంగా చూసినా ఇది ప్రభుత్వ సంస్థ ప్రసారభారతికి పెద్ద విజయం లాంటిదే. అయితే దూరదర్శన్ ఛానల్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఒక గంట ఆలస్యంగా (ఢిఫర్డ్ లైవ్) ప్రసారమవుతాయి.
సంక్షిప్తంగా...
►హక్కుల వ్యవధి: 2018–2023 (ఐదేళ్లు)
►మొత్తం మ్యాచ్‌లు: 102 (22 టెస్టులు, 45 వన్డేలు, 35 టి20లు)
►ఒక్కో మ్యాచ్‌కు చెల్లించే మొత్తం: రూ. 60.17 కోట్లు
►ప్రస్తుతం స్టార్ చేతిలో ఉన్న ప్రసార హక్కులు: ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్, భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లలో జరిగే మ్యాచ్‌లు.
►ప్రస్తుతం సోనీ చేతిలో ఉన్న ప్రసార హక్కులు: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, యూఏఈలలో జరిగే మ్యాచ్‌లు.
మా మ్యాచ్‌లు ప్రసారం చేయరా ప్లీజ్!
ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు దూరదర్శన్‌ను వేడుకున్న రోజుల నుంచి నేడు ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు బీసీసీఐ ఎదిగిన వైనం అనూహ్యం, అసాధారణం. ‘బంగారు బాతు’లాంటి విశేషణాలను క్రికెట్ దాటుకొని చాలా కాలమైంది. ఇప్పుడు భారత బోర్డు ఏం చేసినా కనకవర్షం కురవడమే. గత పాతికేళ్లలో భారత క్రికెట్ ప్రసారహక్కుల ప్రస్థానాన్ని ఒక్కసారి చూస్తే...
►1992: భారత క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు దూరదర్శన్ రూ. 5 లక్షల ఎదురు డబ్బులు డిమాండ్ చేసింది.
►1993: భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన హక్కులు (6 లక్షల డాలర్లు–ట్రాన్స్‌వరల్డ్ ఇంటర్నేషనల్)
►1993: హీరో కప్ (5 లక్షల 50 వేల డాలర్లు–ట్రాన్స్‌వరల్డ్ ఇంటర్నేషనల్)
►1999: ఐదేళ్ల కాలానికి 54 మిలియన్ డాలర్లు (దూరదర్శన్)
►2006: 22 టెస్టులు, 55 వన్డేలు (612 మిలియన్ డాలర్లు – నింబస్)
►2010: నాలుగేళ్లకు 436 మిలియన్ డాలర్లు (నింబస్) – విలువ పడిపోయింది
►2012: ఆరేళ్ళకు 750 మిలియన్ డాలర్లు (స్టార్)
►2018: ఐదేళ్లకు 944 మిలియన్ డాలర్లు (స్టార్)
Comments
Please login to add a commentAdd a comment