డివిలియర్స్ను నిలువరిస్తేనే..
డర్బన్: త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు మ్యాచ్ల ట్వంటీ 20 సిరీస్పై ఆస్ట్రేలియా దృష్టి సారించింది. ఇటీవల భారత్తో స్వదేశంలో జరిగిన టీ 20 సిరీస్లో 3-0 తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలవ్వగా, ఇంగ్లండ్పై సిరీస్ ను సాధించిన దక్షిణాఫ్రికా మంచి ఊపులో ఉంది. మరోవైపు భారత్లో వరల్డ్ ట్వంటీ 20కి ముందు జరిగే సిరీస్ కావడంతో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.
శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై జరిగే ఈ సిరీస్లో సఫారీలను అడ్డుకోవాలంటే ఆస్ట్రేలియా శ్రమించాల్సి ఉంది. ప్రత్యేకంగా దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ను నిలువరించేందుకు ఆస్టేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రణాళికలు రచిస్తున్నాడు. 'ఏబీ విధ్వంసకర ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏబీని ఎంత తొందరగా పెవిలియన్ పంపిస్తే అంత మంచిది. ఒక్కసారి డివిలియర్స్ గాడిలో పడితే అతన్ని ఆపడం చాలా కష్టం.360 డిగ్రీల డివిలియర్స్ కోసం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ఈ సిరీస్ లో డివీపై ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందని భావిస్తున్నా' అని స్మిత్ తెలిపాడు.