
న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీని కోల్పోయిన స్టీవ్ స్మిత్... సోమవారం ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ సారథ్యం నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నాడు. ‘ప్రస్తుత పరిణామాల రీత్యా అతడీ నిర్ణయం తీసుకున్నాడు. వీటి ప్రభావం లేకుండా మేం ఐపీఎల్ బరిలో దిగనున్నాం. బీసీసీఐ అధికారులు, భారత్‌లోని అభిమానుల మద్దతుకు స్మిత్ కృతజ్ఞతలు తెలిపాడు’ అని రాయల్స్ హెడ్ ఆఫ్ క్రికెట్ జుబిన్ బరూచా ఓ ప్రకటనలో వివరించారు.
ఈ అంశంపై బీసీసీఐతో పాటు స్మిత్‌తోనూ తాము ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉన్నామని బరూచా తెలిపారు. మరోవైపు కేప్‌టౌన్‌లోనే ఉన్న రాయల్స్ మెంటార్, మాజీ సారథి షేన్ వార్న్ కూడా స్మిత్‌తో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్‌గా టీమిండియా ఆటగాడు అజింక్య రహానే నియమితుడయ్యాడు. తమ జట్టు గురించి బాగా తెలిసిన రహానేను మేటి నాయకుడిగా ఫ్రాంచైజీ సహ యజమాని మనోజ్ బదాలే కొనియాడాడు. రెండేళ్ల నిషేధం అనంతరం ఈ సీజన్‌లో పునరాగమనం చేస్తున్న రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 9న సన్‌రైజర్స్‌తో హైదరాబాద్‌లో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment