తప్పుగా అర్ధం చేసుకున్నారు: కోహ్లి
ధర్మశాల:ఆస్ట్రేలియాతో చివరి టెస్టు అనంతరం ఆ దేశ క్రికెటర్లు ఇంకెంత మాత్రమూ తనకు స్నేహితులు కాదంటూ వ్యాఖ్యానించి విమర్శలపాలైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తాజాగా వివరణ ఇచ్చాడు. తాను చేసిన ఆ వ్యాఖ్యలు మొత్తం ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి చేసినవి కావంటూ పేర్కొన్నాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులో తనకు ఫ్రెండ్స్ తక్కువగా ఉన్నారనే ఉద్దేశంతోనే అలా వ్యాఖ్యానించినట్లు తెలిపాడు. పలువురు ఆసీస్ క్రికెటర్లు తనకు ఇప్పటికీ స్నేహితులుగా ఉన్నారన్న విషయాన్ని కోహ్లి గుర్తు చేశాడు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్దం చేసుకున్నారంటూ మన స్టార్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరూ ఇంకెంత మాత్రం తన స్నేహితులు కాదంటూ వ్యాఖ్యానించిన తరువాత కోహ్లిపై ఆసీస్ మాజీలు, అక్కడ మీడియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కోహ్లికి పొగరు తలకెక్కిందంటూ ఆసీస్ మీడియా విమర్శలు గుప్పించింది. మరొకవైపు ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్ టేలర్ కూడా కోహ్లి శైలిని తప్పుబట్టాడు. ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ఒక దేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఉన్న వ్యక్తికి తగదంటూ టేలర్ మండిపడ్డాడు. దాంతో తన చేసిన వ్యాఖలను ఆ క్రికెటర్లను కించపరచడానికి చేసినవి కాదంటూ కోహ్లి వివరణ ఇచ్చాడు.
ఆసీస్ క్రికెటర్లను అగౌరవపరిచేందుకు తాను ఈ వ్యాఖ్యలు చేయలేదన్నాడు. తనకు కొంతమంది మాత్రమే ఆసీస్ క్రికెట్ జట్టులో స్నేహితులున్నారని చెప్పడమే తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశమన్నాడు. మరికొద్ది రోజుల్లో ఆరంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కూడా పలువురు ఆసీస్ ఆటగాళ్లతో కలిసి ఆడుతున్న విషయాన్ని కోహ్లి గుర్తు చేశాడు. ఆసీస్ తో సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి తనను తప్పుగా చిత్రీకరించేందుకు యత్నించారన్నాడు. తాను చాలా పోటీ తత్వంతో ఉంటే పనిగట్టుకుని కొంతమంది విమర్శలు గుప్పించడాన్ని కోహ్లి ఈ సందర్బంగా తప్పబట్టాడు.