అశ్విన్ స్థానంలో 18 ఏళ్ల కుర్రాడు
అశ్విన్ స్థానంలో 18 ఏళ్ల కుర్రాడు
Published Thu, Apr 6 2017 7:32 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
చెన్నై: రైజింగ్ పుణే జట్టుకు గాయంతో దూరమైన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్ధానంలో 18 ఏళ్ల తమిళ కుర్రాడు ఎంపికయ్యాడు. కొద్ది రోజుల క్రితం స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతూ ఐపీఎల్‌కు అశ్విన్ దూరమైన విషయం తెలిసిందే. అశ్విన్ లోటు తీర్చేందుకు పుణే జట్టు తమిళ యువ క్రికెటర్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసింది. సుందర్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి స్పిన్ బౌలర్. బంగ్లాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ జట్టులో సుందర్ కీలక ఆటగాడు. విజయ్‌హజారే, దేవధర ట్రోఫిల్లో తమిళనాడు విజయంలో కీలక పాత్ర పోశించాడు.
అశ్విన్ స్థానానికి సుందర్ జమ్ముకశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్‌తో పోటి పడ్డాడు. వీరిద్దరి మద్య పుణే జట్టు నెట్స్‌లో బౌలింగ్ పరీక్ష చేసింది. వీరు పణే కెప్టెన్ స్టీవ్ స్మిత్, మహేంద్ర సింగ్ ధోని, బెన్ స్ట్రోక్స్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. సుందర్ కెప్టెన్ స్మిత్ వికెట్ పడగొట్టడంతో అవకాశం పొందాడు. ‘దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎలాంటి అంచానాలు లేవు, అవకాశం వస్తే ఆడడానికి నేను సిద్దంగా ఉన్నాను. నెట్స్‌లో చాలసార్లు ధోనికి బౌలింగ్ చేశాను. ధోని చాలసార్లు నన్ను ప్రశంసించాడు. అతను చాల సలహాలు ఇచ్చాడు’.అని తన ఎంపికపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఎంపికతో సుందర్ పుణే స్పిన్ విభాగంలోని ఇమ్రాన్ తాహీర్, ఆడమ్ జంపా, అంకత్ శర్మ, తమిళనాడు ఆటగాడు బాబా అపరజిత్‌ల సరసన చేరాడు. తమిళనాడు కోచ్ హ్రిషికేశ్ కనిత్కర్ ఆర్‌పీఎస్ జట్టు సహాకోచ్‌గా ఉండడం సుందర్ ఎంపికకు కలిసొచ్చింది.
Advertisement