వెస్టిండీస్ వద్దు..ఈస్టిండీసే ముద్దు!
అంటిగ్వా: త్వరలో న్యూజిలాండ్ తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్ కు ముందు జరిగే శిక్షణా క్యాంపుకు తాను అందుబాటులో ఉండటం లేదని వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించాడు. జూన్ 8 నుంచి వెస్టిండీస్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు విండీస్‌కు క్యాంప్ నిర్వహించనున్నారు. ఆటగాళ్లు జట్టుతో చేరేందుకు జూన్ 1ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ తేదీలోపు తాను అందుబాటులో ఉండలేనని విండీస్ క్రికెట్ పెద్దలకు తెలియజేశాడు. అదే రోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న కారణంగానే ఆ శిక్షణా క్యాంపుకు హాజరుకాలేక పోతున్నానని తెలిపాడు.
అంతకముందు గడవు తేదీలోగా క్యాంపులో చేరకపోతే తొలి టెస్టులో ఆడే అవకాశం దక్కదని విండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ మైకేల్ మూర్‌హెడ్ స్పష్టం చేశారు. మరోవైపు నైట్‌రైడర్స్ యాజమాన్యం మాత్రం నరైన్‌ను వదులుకోవడానికి ఇష్ట పడటం లేదు. ఫైనల్ ముగియగానే అందు బాటులో ఉన్న తొలి ఫ్లయిట్‌కు నరైన్ పంపిస్తామని కోల్‌కతా సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించినా అది కూడా బెడిసికొట్టింది. దీంతో సందిగ్ధంలో పడ్డ నరైన్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కే మొగ్గు చూపాడు.