టీ20 వరల్డ్‌కప్‌లో రీఎంట్రీపై విండీస్‌ వీరుడి స్పందన ఇదే..! | Sunil Narine Rules Out West Indies Return For Home T20 World Cup 2024 - Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌లో రీఎంట్రీపై విండీస్‌ వీరుడి స్పందన ఇదే..!

Published Tue, Apr 23 2024 9:54 AM | Last Updated on Tue, Apr 23 2024 10:05 AM

Sunil Narine Rules Out International Return For T20 World Cup 2024 - Sakshi

విండీస్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ టీ20 వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై నరైన్‌ తాజాగా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని అన్నాడు. ఇటీవలికాలంలో తన ప్రదర్శనలు సంతృప్తినిచ్చాయని తెలిపాడు.

టీ20 వరల్డ్‌కప్‌ ఆడాలనే అభిమానుల ప్రతిపాదనను గౌరవిస్తానని అన్నాడు. అయితే అందుకు ఓకే మాత్రం చెప్పలేనని వివరించాడు. వరల్డ్‌కప్‌ ఆడే విండీస్‌ జట్టుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని.. విండీస్‌ వీరులు మరో టైటిల్‌కు అర్హులేనంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. నరైన్‌ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటంపై బహిరంగ ప్రకటన చేయడంతో విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఓ అంచనాకు వచ్చింది. నరైన్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని ఒప్పించేందుకు తాను గతకొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని విండీస్‌ టీ20 జట్టు కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, నరైన్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌ మెరపు శతకంతో (56 బంతుల్లో 109) విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో నరైన్‌ 7 మ్యాచ్‌ల్లో సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 286 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌ సాధించిన విజయాల్లో నరైన్‌ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు.

నరైన్‌ ఈ సీజన్‌లోనే రెండు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు. నరైన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నప్పటి నుంచి అతని ఫేట్‌ మారిపోయింది. ఓపెనర్‌గా అతను స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం కేకేఆర్‌ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రతిపాదన. గతంలోనూ గంభీర్‌ నరైన్‌ను ఓపెనర్‌గా పంపి సత్ఫలితాలు సాధించాడు.

35 ఏళ్ల నరైన్‌ 2019లో చివరిసారిగా వెస్టిండీస్‌కు ఆడాడు. అతను 2023లో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. తాజా బ్యాటింగ్‌ ఫామ్‌ నేపథ్యంలో నరైన్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ కోసం చాలామంది వెటరన్‌ క్రికెటర్లు రిటైర్మెంట్‌ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లు ఇమాద్‌ వసీం, మొహహ్మద్‌ ఆమిర్‌ టీ20 వరల్డ్‌కప్‌ కోసం యూ టర్న్‌ తీసుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement