నేడు ‘మ్యాక్స్’ వినోదం!
ఉప్పల్‌లో సన్‌రైజర్స్,కింగ్స్ ఎలెవన్ ఢీ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినా అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ కోసమో లేదంటే ముంబై ఇండియన్స్ కోసమో ఎదురుచూసేవారు. కారణం ఈ రెండు జట్లలో స్టార్లతో పాటు పరుగుల సునామీ సృష్టించే ఆటగాళ్లు ఉండటమే. అయితే ఈ సారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అభిమానులంతా ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోనూ అదే జోరు కొనసాగించి ఫోర్లు, సిక్సర్లతో కనువిందు చేస్తాడని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఉప్పల్‌లో జరగనున్న సన్‌రైజర్స్, పంజాబ్ మ్యాచ్‌కు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది.
సొంతగడ్డపై గాడిలో పడేనా ?
ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోమవారం ఆడిన తొలి హోమ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తయింది. దీంతో బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరగనున్న పోరు సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించిన సన్‌రైజర్స్ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరుకోవాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లూ కీలకమే. ఇందులో మూడు మ్యాచ్‌లు సొంతగడ్డ హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. ఈ మూడింటిలో గెలిచి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది.
అయితే జోరుమీదున్న పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా అడ్డుకుంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. వికెట్లు తీసేందుకు బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. కీలక తరుణంలో స్టెయిన్, భువనేశ్వర్, హెన్రిక్స్, ఇర్ఫాన్ పఠాన్ బంతితో చెలరేగాల్సి ఉంటుంది. ఇక బ్యాట్స్‌మెన్‌లో ఫించ్, వార్నర్ ఫామ్‌లోకి వచ్చినా... కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం తన బ్యాట్ పవర్ మాత్రం ఇంకా చూపలేకపోతున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించి పంజాబ్‌ను ఓడించగలిగితే... మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో ఆత్మవిశ్వాసంతో ఆడొచ్చు.
ఈసారి ఎవరి వంతో?
బ్యాట్స్‌మెన్ మెరుపులకు తోడు బౌలర్ల ప్రతిభ కారణంగా ఎవరూ ఊహించని విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ దశకు చేరువైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడింది. అయితే ఇకముందు కూడా ఐపీఎల్‌లో అదే ఊపును కొనసాగించాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ జట్టు సత్తా చాటాల్సి ఉంటుంది. మ్యాక్స్‌వెల్, మిల్లర్‌తో పాటు వీరూ కూడా ఫామ్‌లో ఉన్నాడు. వీరితో పాటు కెప్టెన్ బెయిలీ కూడా ప్రమాదకర ఆటగాడు. ఈ నలుగురిలో ఎవరు హైదరాబాద్ అభిమానులను తమ ‘హిట్టింగ్’తో అలరిస్తారో చూడాలి. అలాగే బౌలర్లు సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్ రాణిస్తున్నారు. మరోసారి కలిసికట్టుగా రాణిస్తే పంజాబ్‌కు తిరుగుండదు.