
205... సరిపోలేదు!
పంజాబ్ సూపర్ ఛేజింగ్
ఆరు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు
రాణించిన సాహా, వోహ్రా, మ్యాక్స్‌వెల్
నమన్ ఓజా శ్రమ వృథా
పంజాబ్‌ది బలమైన బ్యాటింగ్ లైనప్... ఇందులో సందేహం లేదు. హైదరాబాద్ బౌలింగ్ కూడా అన్ని జట్లలోకీ ఉత్తమం. ఈ నేపథ్యంలో సొంత గడ్డపై హైదరాబాద్ జట్టు 205 పరుగులు చేశాక కూడా ఓడిపోతుందా..? పంజాబ్ జట్టు ఒక్క మ్యాక్స్‌వెల్ మీదో, మిల్లర్ మీదో ఆధారపడితే సన్‌రైజర్స్ గెలిచేదేమో.
కానీ కింగ్స్ ఎలెవన్ యువ క్రికెటర్లు సాహా, వోహ్రా సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఏకంగా పవర్‌ప్లేలోనే 86 బాదారు. ఈ యువ జోడీ జోరుకే సగం డీలా పడ్డ ధావన్ సేనను... మ్యాక్స్‌వెల్, బెయిలీ ఉతికి ఆరేశారు. వెరసి... హైదరాబాద్ 205 పరుగులు చేసినా పంజాబ్ ముందు సరిపోలేదు.
సాక్షి, హైదరాబాద్:ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతూనే ఉంది. బుధవారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నమన్ ఓజా (36 బంతుల్లో 79 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా... శిఖర్ ధావన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (23 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వృద్ధిమాన్ సాహా (26 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనన్ వోహ్రా (20 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరంభంలో చెలరేగగా... మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెయిలీ (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించారు.
నమన్ జోరు
బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సన్‌రైజర్స్ ఆసాంతం అదే జోరు కొనసాగించింది. ఓపెనర్లు ఫించ్ (23 బంతుల్లో 20; 2 ఫోర్లు), ధావన్ శుభారంభం అందించారు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 55 పరుగులకు చేరింది. స్పిన్నర్ శివమ్ శర్మ... ఫించ్‌ను బౌల్డ్ చేయడంతో 65 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.
కీపర్ నమన్ ఓజా ఆరంభంనుంచే దూకుడు ప్రదర్శించాడు. ధావన్ వెనుదిరిగాక వార్నర్‌తో కలిసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. వీరిద్దరు పోటీ పడి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారు. వీరిద్దరు 42 బంతుల్లోనే 81 పరుగులు జోడించడం విశేషం.
29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఓజా, చివరి వరకు నిలబడి స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 6 ఓవర్లలో హైదరాబాద్ 94 పరుగులు సాధించింది.
పవర్‌ఫుల్ ప్లే...
భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతిని ఫోర్ బాదిన సెహ్వాగ్ (4) రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే రైజర్స్‌లాగే పంజాబ్‌కు కూడా కీపర్ సాహా కలిసొచ్చాడు. భువీ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను, హెన్రిక్స్ ఓవర్లో మరో సిక్స్, ఫోర్ బాదాడు.
కేవలం 22 బంతుల్లోనే సాహా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వోహ్రా కూడా రాణించాడు. దీంతో పంజాబ్ పవర్‌ప్లేలో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 86 పరుగులు చేసింది. సాహా అవుటయ్యాక మ్యాక్స్‌వెల్ వచ్చీ రాగానే తన సత్తా చూపించాడు. దురదృష్టవశాత్తూ వోహ్రా రనౌట్ కాగా, విజయానికి 47 పరుగులు కావాల్సిన స్థితిలో మ్యాక్సీ వెనుదిరిగాడు.
అయితే మిల్లర్ (24 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి బెయిలీ జట్టుకు విజయాన్ని అందించాడు. స్టెయిన్ వేసిన 18 ఓవర్లో బెయిలీ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి గెలుపు ఖాయం చేశాడు.
స్కోరు వివరాలు: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) శివమ్ 20; ధావన్ (సి) శివమ్ (బి) 45; నమన్ ఓజా (నాటౌట్) 79; వార్నర్ (రనౌట్) 44; హెన్రిక్స్ (సి) మిల్లర్ (బి) సందీప్ 0; ఇర్ఫాన్ (సి) మిల్లర్ (బి) రిషి ధావన్ 1; కరణ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15: మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1-65; 2-88; 3-169; 4-183; 5-196.
బౌలింగ్: సందీప్ 4-0-65-1; జాన్సన్ 4-0-26-0; శివమ్ 4-0-31-1; అక్షర్ 4-0-40-0; రిషి ధావన్ 4-0-42-2.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 4; వోహ్రా (రనౌట్) 47; సాహా (స్టంప్డ్) ఓజా (బి) కరణ్ 54; మ్యాక్స్‌వెల్ (సి) స్టెయిన్ (బి)మిశ్రా 43; మిల్లర్ (నాటౌట్) 24; బెయిలీ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1-4; 2-95; 3-125; 4-159.
బౌలింగ్: భువనేశ్వర్ 3.4-0-38-1; స్టెయిన్ 4-0-51-0; హెన్రిక్స్ 2-0-36-0; కరణ్ శర్మ 4-0-46-1; మిశ్రా 4-0-32-1; ఇర్ఫాన్ 1-0-5-0.
మ్యాచ్ హైలైట్స్
ఈ సీజన్‌లో పంజాబ్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన సందీప్ శర్మ ఈ మ్యాచ్‌లో మాత్రం ఏకంగా 65 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఉమేశ్ యాదవ్ (65) సరసన చేరాడు. గత ఏడాది ఇదే మైదానంలో చెన్నైపై ఇషాంత్ ఇచ్చిన 66 పరుగులు ఐపీఎల్‌లో అతి చెత్త ప్రదర్శన.
మ్యాక్స్‌వెల్ హిట్టింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం హైదరాబాద్ అభిమానులకు దక్కింది. సన్‌రైజర్స్ లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్‌లోనే మ్యాక్స్‌వెల్ ఏకంగా 5 సిక్సర్లు బాదాడు.
మ్యాక్స్‌వెల్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిశ్రా బౌలింగ్‌లో స్టెయిన్ క్యాచ్ పట్టగా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఆ తర్వాత మరో 20 పరుగులు జోడించి మిశ్రా బౌలింగ్‌లోనే స్టెయిన్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.