
Sunrisers Hyderabad Unaffected by David Warner Ouster - Sakshi
ఐపీఎల్‌లో 2014 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో 2014 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2016లో కెప్టెన్‌గా జట్టును గెలిపించడంలో కూడా కీలక పాత్ర పోషించిన వార్నర్... ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధం కారణంగా ఈసారి జట్టుకు దూరమయ్యాడు. అయితే వార్నర్ లేకపోవడాన్ని తాము లోటుగా భావించడం లేదని రైజర్స్ కోచ్ టామ్ మూడీ స్పష్టం చేశారు. అతను గొప్ప బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదని, అయితే ఆ స్థానంలో వచ్చే ఆటగాడు కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వగలడని తాము నమ్మతున్నట్లు మూడీ వ్యాఖ్యానించారు.
‘కారణాలు ఏమైనా వార్నర్ టీమ్‌లో లేడనే వాస్తవాన్ని గుర్తించాలి. ఇది టీమ్ గేమ్. ఎవరో ఒక ఆటగాడిపై ఆధారపడి ఫలితం ఉండదు. ఇదంతా సమష్టి కృషి. వార్నర్ స్థానంలో అవకాశం దక్కితే సత్తా చాటేందుకు ఎంతో మంది ఆటగాళ్లు మా జట్టులో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా దృష్టిలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరిచే ఉంటుంది’ అని మూడీ అభిప్రాయపడ్డారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో గురువారం రైజర్స్ జట్టు పరిచయ కార్యక్రమం జరిగింది.
ఇందులో కోచ్ మూడీ, మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ మీడియాతో జట్టు విజయావకాశాల గురించి మాట్లాడారు. బ్యాటింగ్ పరంగానే కాకుండా విలియమ్సన్ ఉండటంతో తమ టీమ్ కెప్టెన్సీ గురించి కూడా అసలేమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకపోయిందని మూడీ చెప్పారు. ‘వార్నర్ ఆసీస్‌కు వైస్ కెప్టెన్ అయితే విలియమ్సన్ మరో జాతీయ జట్టుకు కెప్టెన్ అనే విషయం మరచిపోవద్దు. పైగా కివీస్ ఆటగాళ్లు ఎంత క్రీడాస్ఫూర్తితో ఆడతారో ప్రపంచానికి తెలుసు. అలాంటి జట్టును అతను నడిపిస్తున్నాడు. నాకు కేన్ నాయకత్వ పటిమ గురించి బాగా తెలుసు. కెప్టెన్‌గా లేకపోయినా గతంలోనూ జట్టు కీలక సూచనలు చేసేవాడు. కాబట్టి అతనిపై మాకు నమ్మకముంది. కాబట్టి ఈ దశలో వార్నర్ గురించి ఆలోచించడం అనవసరం’ అని మూడీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
విధ్వంసకర బ్యాట్స్‌మన్ కావడంతో పాటు కుడిచేతి వాటం ఓపెనర్ కావడం వల్లే అలెక్స్ హేల్స్‌ను ఎంచుకున్నట్లు మూడీ వెల్లడించారు. వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ... ‘వేలంలో మా వ్యూహం ప్రకారం చాలా వరకు ఆశించిన జట్టునే ఎంపిక చేసుకోగలగడం అదృష్టం. 2–3 సీజన్లుగా సమస్యగా ఉన్న మిడిలార్డర్‌ను ఈసారి పటిష్టపరిచాం. స్థాయికి తగినట్లుగా ఆడితే మేం మరోసారి టైటిల్ సాధించగలం’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తమ జట్టులోని ఇద్దరు ప్రధాన స్పిన్నర్లలో షకీబ్‌ను పరుగులు నియంత్రించేందుకు, రషీద్‌ను ప్రధానంగా వికెట్లు పడగొట్టేందుకు వాడుకుంటామని బౌలింగ్ కోచ్ మురళీధరన్ తమ వ్యూహాన్ని వివరించారు.