రషీద్ ఖాన్
ఒకవైపు వాంఖడే స్టేడియం మొత్తం సచిన్ నామస్మరణతో ఊగిపోతోంది... స్వయంగా టెండూల్కర్ ముంబై ఇండియన్స్ టీమ్ జెర్సీలో కుటుంబ సభ్యులతో మైదానానికి వచ్చి అక్కడే తన పుట్టిన రోజు కేక్ కట్ చేశాడు... దిగ్గజ క్రికెటర్‌కు విజయాన్ని కానుకగా ఇవ్వాలని భావించిన ముంబై సగం ఆట ముగిసేసరికి తమ ప్రయత్నంలో సఫలమైనట్లే కనిపించింది. 119 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఫటాఫట్‌గా ఛేదించి ఇక బర్త్‌డే పార్టీ చేసుకోవడమే మిగిలిందని అనిపించింది... కానీ సచిన్‌నే కాదు మొత్తం ముంబైకర్లను రోహిత్ బృందం తీవ్ర నిరాశకు గురి చేసింది. పేలవమైన బ్యాటింగ్‌తో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. 87 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతో ముంబై మూగబోయింది.
ముంబై: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని దక్కించుకుంది. బ్యాటింగ్ వైఫల్యం తర్వాత ఏమాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో బౌలింగ్‌తో చెలరేగి కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. విలియమ్సన్ (21 బంతుల్లో 29; 5 ఫోర్లు), యూసుఫ్ పఠాన్ (33 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) మోస్తరు ప్రదర్శన చేశారు. మయాంక్ మార్కండే, హార్దిక్ పాండ్యా, మెక్లీనగన్ పొదుపైన బౌలింగ్‌తో పాటు తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. సూర్య కుమార్ యాదవ్ (38 బంతుల్లో 34; 4 ఫోర్లు), కృనాల్ పాండ్యా (20 బంతుల్లో 24; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. సిద్ధార్థ్ కౌల్ 3 వికెట్లు తీయగా, థంపి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రషీద్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి.
ఒకరి వెనుక మరొకరు...
పవర్‌ప్లే ముగిసేసరికి 51 పరుగులకే 4 వికెట్లు... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని ఇది చూపిస్తోంది. బుమ్రా వేసిన తొలి ఓవర్లో విలియమ్సన్ కొట్టిన రెండు ఫోర్లతో శుభారంభం లభించినట్లు అనిపించినా కొద్ది సేపటికి రైజర్స్ పరిస్థితి తారుమారైంది. మెక్లీనగన్ రెండు బంతుల తేడాతో శిఖర్ ధావన్ (5), సాహా (0)లను ఔట్ చేసి హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. మరో ప్రధాన బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే (16) వరుస వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఆ వెంటనే విలియమ్సన్‌తో సమన్వయ లోపంతో షకీబ్ (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. మెక్లీనగన్ వేసిన బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపు ఆడిన విలియమ్సన్ సింగిల్ కోసం షకీబ్‌ను పిలిచి ఆపై నిరాకరించాడు. షకీబ్ వెనక్కి వెళ్లే లోపు సూర్య కుమార్ డైరెక్ట్ త్రో వికెట్లను పడగొట్టింది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను హార్దిక్ ముగించాడు... సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న నబీ (14), రషీద్ (6), థంపి (3) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. చివర్లో పఠాన్ కూడా స్థాయికి తగినట్లుగా ఆడలేకపోవడంతో ఐపీఎల్‌లో రైజర్స్ తమ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 19వ ఓవర్ మూడో బంతికి పఠాన్ ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్ కొట్టడానికి ముందు సన్ జట్టు వరుసగా 34 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయింది.
సూర్యకుమార్ మినహా...
స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఇన్నింగ్స్ కూడా తడబాటుతో ప్రారంభమైంది. భువనేశ్వర్ లేకపోయినా సన్‌రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని నిలువరించింది. 9 పరుగుల వ్యవధిలో ముంబై మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. లూయీస్ (5), ఇషాన్ కిషన్ (0)లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (2) కూడా వెంటవెంటనే ఔట్ కావడంతో ముంబై స్కోరు 21/3 వద్ద నిలిచింది. ఈ దశలో సూర్య కుమార్, కృనాల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సూర్య కుమార్ క్రీజ్‌లో నిలదొక్కుకోగా, కౌల్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి కృనాల్ దూకుడు ప్రదర్శించాడు. అయితే 40 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం అనంతరం రషీద్ చక్కటి బంతితో కృనాల్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. పేలవ షాట్‌కు పొలార్డ్ (9) నిష్క్రమించడంతో ఒక్కసారిగా ముంబైపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆశలు పెట్టుకున్న సూర్య కుమార్‌ను థంపి అవుట్ చేయడంతో పరిస్థితి తలకిందులైంది. హార్దిక్ పాండ్యా (3) కూడా ఏమీ చేయలేకపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
► టి20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. అంతకుముందు నరైన్, బ్రేవో, ఆఫ్రిది, మలింగఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment