ధావన్ ధనాధన్ ముందు రిషభ్ పంత్ మెరుపులు వెలవెలబోయాయి. ఇప్పటిదాకా బౌలింగ్ సత్తాతో గెలిచిన సన్‌రైజర్స్ ఈసారి బ్యాట్‌తో పరుగుల వాన కురిపించింది. తొమ్మిదో విజయంతో ఐపీఎల్–11లో ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుర్తింపు పొందిది. లీగ్ కీలక సమయంలో బ్యాటింగ్ కూడా బలపడటం హైదరాబాద్ ఆల్‌రౌండ్ సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసింది.
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ బలం బౌలింగే. ఇంటాబయటా హైదరాబాద్ విజయాల్లో బౌల ర్లదే కీలక భూమిక. కానీ ఫిరోజ్ షా కోట్లాలో సీన్ మారింది. ముందుగా బౌలింగ్‌లో తేలిపోయింది. రిషభ్ తుఫాను సెంచరీలో నిండా మునిగింది. కానీ బ్యాటింగ్‌లో ఎగిసిపడింది. కష్టమైన లక్ష్యాన్ని హైదరాబాద్ ధనాధన్ మెరుపులతో అధిగమించింది. గురువారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా ఆరో విజయంతో ఈ సీజన్‌లో తొమ్మిదో గెలుపుతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (63 బంతుల్లో 128 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తర్వాత హైదరాబాద్ 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసి గెలిచింది. ధావన్ (50 బంతుల్లో 92 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి గెలిపించారు.
60 బంతుల్లో 60 చేయలేదు కానీ...
ఈ టి20 మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను 10–10 ఓవర్లుగా విడదీసి చూసుకుంటే ఆరంభం పేలవంగానే కనబడుతుంది. తొలి సగం ఇన్నింగ్స్‌లో డేర్‌డెవిల్స్ బంతికో పరుగైనా చేయలేదు. పది ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసింది. రెండో సగం మాత్రం దద్దరిల్లింది. ఈ సెకండాఫ్‌లో నష్టపోయింది రెండే వికెట్లు... కానీ తుఫాన్ వేగంతో ఏకంగా 135 పరుగులు చేసేసింది. పవర్ స్టార్ పంత్ డెత్ ఓవర్లలో సన్ బౌలర్లను చితగ్గొట్టాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి నాలుగో ఓవర్లోనే కష్టాలు రెట్టింపయ్యాయి. ఓపెనర్లు పృథ్వీ షా (9), జాసన్ రాయ్ (11) ఇద్దరూ షకీబ్ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల్లోనే నిష్క్రమించారు. అప్పటికి ఢిల్లీ స్కోరు 21/2. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌ల ఆట మొదలైంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన ఆరో ఓవర్లో పంత్ ‘హ్యాట్రిక్’ ఫోర్లతో ఢిల్లీకి ఊపు తెచ్చాడు. కానీ అతని అనవసర పిలుపు కెప్టెన్ అయ్యర్ (3)ను రనౌట్ చేసింది... ఢిల్లీని ఆత్మరక్షణలో పడేసింది. ఈ దశలో రిషభ్‌కు హర్షల్ పటేల్ జతయ్యాడు. పదో ఓవర్‌దాకా సాదాసీదాగానే ఇన్నింగ్స్ సాగింది. సరిగ్గా 11వ ఓవర్ నుంచి పంత్ ప్రతాపం మొదలైంది. కౌల్ వేసిన ఆ ఓవర్లో అతను సిక్స్, ఫోర్‌తో 14 పరుగులు రాబట్టాడు. 12వ ఓవర్లో రషీద్‌నూ వదిలిపెట్టలేదు. మూడు బౌండరీలతో మరో 15 పరుగులు పిండుకున్నాడు.
‘భువి’కి దించాడు...
హైదరాబాద్ డెత్ ఓవర్ల కింగ్ భువనేశ్వర్. అలాంటి అనుభవజ్ఞుడైన భువీని ఒక్కో షాట్‌తో నేలకు దించాడు రిషభ్ పంత్. ఇంతవరకు పూర్తి కోటాలో 25, 30 పరుగులిచ్చుకోని ఈ పేసర్‌ను ఫిఫ్టీ పరుగుల క్లబ్‌లో చేర్చాడు. భువీ వేసిన 18 ఓవర్లో 18 పరుగులు బాదేసిన యువ సంచలనం... చివరి ఓవర్లో అయితే శివమెత్తాడు. ఫీల్డర్లకు చిక్కని బౌండరీలను, ప్రేక్షకుల చేతికందే సిక్సర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.
ఆడుతూ పాడుతూ...
18.5 ఓవర్లు వేసిన ఢిల్లీకి ఏ ఓవరూ కలిసిరాలేదు. 113 బంతులేస్తే... ఒకే ఒక్క బంతి మాత్రం హేల్స్ (14)ను ఔట్ చేసింది. ఢిల్లీని మురిపించింది. కానీ ఇది క్షణాలపాటే! తర్వాత ప్రతి బంతి, ప్రతి ఓవర్ అన్ని హైదరాబాద్‌ను విజయబావుటావైపే తీసుకెళ్లాయి. రెండో ఓవర్లోనే ఓపెనర్ ధావన్‌కు జతయిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కడదాకా సమన్వయంతోనే బ్యాటింగ్ చేశాడు. పరస్పరం స్ట్రయికింగ్ మార్చుకుంటూ, చేయాల్సిన రన్‌రేట్‌ను ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ హైదరాబాద్ పరుగుల నావను నడిపించారు. ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసిన సన్‌రైజర్స్ సగం ఓవర్లు ముగిసేసరికి 91/1తో పటిష్టస్థితికి చేరింది. ధావన్ 30 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ 38 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. శ్రేయస్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఆఖరిదాకా ఆడుతూ పాడుతూనే పని ముగించారు. అబేధ్యమైన రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌ను గెలిపించారు.
ఈ విధ్వంసం వీరోచితం...
లీగ్‌లో హైదరాబాద్ భీకర బౌలింగ్ లైనప్‌ను చూసి బరిలో దిగకముందే జట్లకు జట్లు జావగారిపోతున్న వేళ... రిషభ్ పంత్ ఒక్కడు నిలిచాడు. షాట్లకు వీలుచిక్కని బంతులతో ప్రత్యర్థులను ముప్పేట చుట్టేస్తున్న భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్ త్రయాన్ని గురువారం మ్యాచ్‌లో నాలుగు చెరువుల నీళ్లు తాగించాడు. కసిగా కొట్టాలన్న పంతం పట్టాడో, మ్యాచ్‌లో తనవల్ల జరిగిన రెండు రనౌట్ తప్పులను దిద్దుకోవాలన్న దీక్షబూనాడో కాని ర్యాంప్ షాట్లతో చెరిగేశాడు. వాస్తవానికి మ్యాచ్‌లో రిషభ్ వస్తూనే వరుసగా మూడు ఫోర్లు కొట్టి దూకుడుగా కనిపించాడు. కానీ, కెప్టెన్ అయ్యర్ రనౌట్‌తో పరిస్థితిని గ్రహించి కొంత తగ్గాడు.
కుదురుకున్నాక మాత్రం వెనుదిరిగి చూడలేదు. అతడి దెబ్బకు మొదటి నుంచి బలైంది సిద్ధార్థ్ కౌల్. తర్వాతి వంతు రషీద్ ఖాన్‌ది. మధ్యలో షకీబ్ కూడా చిక్కినా అప్పటికి కోటా అయిపోవడంతో బతికిపోయాడు. ఇక డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్‌కు 18, 20వ ఓవర్లలో ఏకంగా చుక్కలు చూపాడు. క్రీజుకు ముందు నిల్చొని, పాదాలను వేగంగా కదిలిస్తూ, ర్యాంప్ షాట్‌కు బ్యాట్‌ను పూర్తిగా తెరిచేసి... ఇలా అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ఇతరులకు పాఠం చెబుతున్నట్లుగా ఆడాడు.
ఈ రెండు ఓవర్లలో భువీ వైడ్ సహా 44 పరుగులివ్వగా... అందులో పంత్ చేసినవే 43. చివరి ఓవర్లో అయితే రిషభ్ విధ్వంసమే సృష్టించాడు. రెండు ఫోర్లు, మూడు వరుస సిక్స్‌లతో 26 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రిషభ్... ఇషాన్ కిషన్, సంజు శామ్సన్ వంటి యువ వికెట్ కీపర్లతో పోటీలో ఒక మెట్టు పైకెదిగాడనేది కాదనలేని నిజం.
►50 ఐపీఎల్ చరిత్రలో నమోదైన సెంచరీల సంఖ్య
►12 ఐపీఎల్‌లో సెంచరీ చేసిన 12వ భారతీయ క్రికెటర్ రిషభ్ పంత్. గతంలో మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, పాల్ వాల్తాటి, రహానే, సచిన్, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రైనా ఒక్కో సెంచరీ చేశారు. మురళీ విజయ్, సెహ్వాగ్ రెండేసి సెంచరీలు సాధించారు. విరాట్ కోహ్లి అత్యధికంగా నాలుగు సెంచరీలు చేశాడు.
►128 ఐపీఎల్‌లో, టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రిషభ్ పంత్.
►2 మనీశ్ పాండే (19 ఏళ్ల 253 రోజులు–2009లో) తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా పంత్ (20 ఏళ్ల 218 రోజులు).
Comments
Please login to add a commentAdd a comment