భువనేశ్వర్ (ఫైల్‌ఫొటో)
ముంబై : ఐపీఎల్-11 సీజన్‌లో హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో తొలి స్థానం సంపాదించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా రెండు పరాజాయలతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక మంగళవారం వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో నెగ్గి వరుస ఓటములకు బ్రేక్ వేయాలనుకున్న సన్‌రైజర్స్‌కు ఆటగాళ్ల గాయాలు కలవర పెడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. భువీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, ఫిజియో సూచనల మేరకు విశ్రాంతిచ్చినట్లు తెలుస్తోంది.
ఇక కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్ సొంత మైదానం వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌కు సైతం దూరమయ్యాడు. అయితే ప్రస్తుత ముంబై మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. చెన్నై మ్యాచ్‌లో గాయపడ్డ యూసఫ్ పఠాన్‌పై అనుమానాలు నెలకొన్నాయి. గాయం కారణంగా భువీ జట్టుతో ముంబైకి రాలేదని కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పష్టం చేశాడు. యూసఫ్ పఠాన్ కూడా మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని, శిఖర్ మాత్రం కోలుకున్నాడని భావిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన రషీద్ ఖాన్ తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.
‘‘రషీద్ వరల్డ్ క్లాస్ బౌలర్. టీ20ల్లో ఏ బౌలర్ అయినా ఒత్తిడి నుంచి తప్పించుకోలేడు. టీ20ల్లో బౌలర్లు సైతం హిట్ చేయగలరు. టీ20 మ్యాచ్‌ల స్వభావమే ఇది. ఇప్పటికే రషీద్ కొద్ది సమయంలోనే ఆటతీరు గురించి చాలా నేర్చుకున్నాడని భావిస్తున్నా. అతను నేలకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకుంటాడు.’’అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ సీజన్‌లో ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 1 వికెట్ తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment