
సురేశ్ రైనా వచ్చాడు!
యువరాజ్‌కు నిరాశ
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం భారత్ తరఫున ఆఖరి వన్డే ఆడిన సురేశ్ రైనా తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగే తొలి మూడు వన్డేల కోసం భారత జట్టును గురువారం సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వరుస వైఫల్యాలతో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరిగిన వన్డే సిరీస్‌లలో స్థానం కోల్పోరుున రైనా, ఇప్పుడు పునరాగమనం చేశాడు. రైనా పార్ట్‌టైమ్ స్పిన్ కూడా అతని ఎంపికకు కారణమని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. మరో వైపు జట్టులో స్థానాన్ని ఆశించిన యువరాజ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. అతని పేరును సెలక్టర్లు పరిశీలించలేదు. సీనియర్లతో పాటు ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా ఆడిన యువ ఆటగాళ్లపై కమిటీ విశ్వాసం ఉంచింది. తాజాగా జట్టులోకి ఎంపికై న మన్‌దీప్ సింగ్, జయంత్ యాదవ్, హార్దిక్ పాండ్యా భారత్ తరఫున టి20లు ఆడినా...ఇప్పటి వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు.
గాయాల కారణంగా ధావన్, రాహుల్, భువనేశ్వర్ పేర్లను పరిశీలించలేదు. టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన అశ్విన్, జడేజా, షమీలు మున్ముందు చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున వారికి వన్డేలనుంచి విశ్రాంతి కల్పిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. అక్టోబరు 16 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది.
తొలి మూడు వన్డేలకు జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, రహానే, కోహ్లి, మనీశ్ పాండే, రైనా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, బుమ్రా, ధావల్ కులకర్ణి, ఉమేశ్ యాదవ్, మన్‌దీప్ సింగ్, కేదార్ జాదవ్.