అశ్విన్కు షాకిచ్చిన విండీస్!
కింగ్స్టన్: వెస్టిండీస్ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. ఇక్కడి సబీనా పార్క్లో భారత్తో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో తాను షాక్ తిన్నట్లు తెలిపాడు. వారిబలాబలాలు తెలిసి కూడా బ్యాటింగ్ ఎంచుకుని పది పరుగుల లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయారని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి విండీస్ బౌలింగ్ ఎంచుకుంటుందని తాను భావించానని, అయితే బ్యాటింగ్ ఎంచుకుని విండీస్ త్వరగా కష్టాల్లో చిక్కుకుందన్నాడు.
విండీస్ పతనాన్ని ఇషాంత్ మొదలెట్టగా అశ్విన్(5/52) వారిని బెంబెలెత్తించాడు. కేవలం 34 టెస్టుల్లోనే 18వ సారి 5 వికెట్లు తీసి తన రికార్డు మెరుగు పరుచుకున్నాడు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 196 పరుగులకే విండీస్ కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. ధావన్(27), రాహుల్(75 బ్యాటింగ్) తొలి వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ కు తోడుగా పుజారా(18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.