
న్యూఢిల్లీ:ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మద్దతుదారులు తనపై చేయిచేసుకోవడంపై సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణా స్పందించాడు. సుశీలే స్వయంగా అతని మద్దతుదారులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని రాణా ఆరోపించాడు. ఈ క్రమంలోనే సుశీల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘సెమీస్ బౌట్ ముగిసిన వెంటనే సుశీల్ .. అతని మద్దతుదారులను నాపైకి ఉసిగొల్పాడు. రాణా ఇక్కడే ఉన్నాడు చూసుకోండి అని చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. దగ్గరుండి మరీ ఇలా చేయించడం దారుణం. ఆ రోజు దాడిలో నా సోదరుని తలపై కుర్చీతో దాడి చేశారు. నా సోదరుడు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు' అని రాణా పేర్కొన్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం.
వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్‌లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించినా వివాదం మాత్రం సుశీల్‌ను వీడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment