క్యారమ్‌కు ఇప్పుడు విలువ పెరిగింది
మంచి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి
జాతీయ ఆటగాడు శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: చాలా మందిలాగే సరదాగా ఇంట్లో ఆడుకున్న ఆట ఇప్పుడు అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. జాతీయస్థాయిలో విజేతగా నిలిపింది. క్యారమ్‌లాంటి క్రీడతో కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని నిరూపించిన ఆ కుర్రాడి పేరు కొమరవెల్లి శ్రీనివాస్. ఇటీవల వైజాగ్‌లో జరిగిన జాతీయ సీనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్, రాబోయే ఫెడరేషన్ కప్‌పై దృష్టి పెట్టాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని అతను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. ఈ నెల 22 నుంచి వారణాసిలో జరిగే ఫెడరేషన్ కప్ పోటీలకు శ్రీనివాస్ సిద్ధమవుతున్నాడు.
అన్న అండతో...
హైదరాబాద్‌కే చెందిన శ్రీనివాస్ పెద్దన్న తిరుపతి ఇంట్లో క్యారమ్ ఆడటంతో పాటు స్థానికంగా చిన్న చిన్న పోటీల్లో పాల్గొనేవాడు. అదే స్ఫూర్తితో పదేళ్ల వయసులో ఆట నేర్చుకున్న శ్రీనివాస్ విక్టరీ ప్లేగ్రౌండ్‌లో కోచ్‌ల దృష్టిలో పడ్డాడు. కోచ్ శోభన్‌రాజ్ తీర్చిదిద్దడంతో రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు సాధించాడు. తొలి సారి అండర్-14 జాతీయ విజేతగా నిలవడంతో శ్రీనివాస్‌కు గుర్తింపు దక్కింది.
వరుస విజయాలు...
ఆ తర్వాత శ్రీనివాస్ ఒక్కసారిగా దూసుకొచ్చాడు. జూనియర్ నేషనల్స్‌లో విజేతగా నిలవడంతో పాటు ఫెడరేషన్ కప్, సీనియర్ నేషనల్స్‌లోనూ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, సార్క్ పోటీల్లో కూడా నిలకడగా విజయాలు అందుకున్నాడు. శ్రీనివాస్ ప్రతిభను గుర్తించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అతనికి 18 ఏళ్లు రాకముందే ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగ అవకాశం కల్పించి ప్రోత్సహించింది.
మరింతగా రాణిస్తా...
క్యారమ్‌లో తాను సాధించిన విజయాల పట్ల 21 ఏళ్ల శ్రీనివాస్ సంతోషంగా ఉన్నాడు. ‘క్యారమ్‌ను అంతా ఫ్యామిలీ గేమ్‌గానే భావిస్తారు. బాగా ఆడేవారు కూడా అక్కడే ఆగిపోతారు. అయితే ఇల్లు విడిచి బయటికి వస్తే ఈ ఆట విస్తృతి ఏమిటో తెలుస్తుంది’ అని అతను చెప్పాడు. రెండేళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో శ్రీనివాస్ నాలుగో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో అదే అతని అత్యుత్తమ ప్రదర్శన. అందుకే వచ్చే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు.
‘2016లో లండన్‌లో ఈ టోర్నీ జరగనుంది. దాని కోసం ఇప్పటినుంచే ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాను. రోజుకు కనీసం 7 గంటల పాటు సాధన చేస్తున్నాను. జాతీయ స్థాయిలో, ఆసియా స్థాయిలో సాధించిన విజయాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో రాణిస్తే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
శ్రీనివాస్ సాధించిన కొన్ని కీలక విజయాలు
2009- జాతీయ జూనియర్ చాంపియన్
2011- ఆసియా చాంపియన్‌షిప్‌లో
2 స్వర్ణాలు, 1 రజతం
2011- సార్క్ క్రీడల్లో 2 స్వర్ణాలు
2012- శ్రీలంకతో టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు
2012- వరల్డ్ చాంపియన్‌షిప్ సింగిల్స్‌లో నాలుగోస్థానం; డబుల్స్‌లో రజతం, టీమ్ ఈవెంట్లో స్వర్ణం
2013- ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2 రజతాలు
2013- జాతీయ సీనియర్ చాంపియన్
2014- అంతర్జాతీయ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ టోర్నీ విజేత
పట్టుదలే అతని బలం
సాధారణ ప్రతిభ ఉన్నా పట్టుదల, అంకితభావం ఉంటే పెద్ద స్థాయి విజయాలు దక్కించుకోవచ్చనేదానికి శ్రీనివాస్ మంచి ఉదాహరణ. అదే అతడిని ఇతర ఆటగాళ్లతో పోలిస్తే భిన్నంగా నిలబెడుతోంది. ముఖ్యంగా కొన్ని సార్లు పాకెటింగ్‌లో బలహీనంగా కనిపించినా చివరి వరకు పోరాడే తత్వంతోనే అతనికి మంచి ఫలితాలు వస్తున్నాయి.
- శోభన్‌రాజ్, కోచ్
లక్ష్యం... ప్రపంచ చాంపియన్
Published Sun, Mar 23 2014 12:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement