
పదేళ్లకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో...
బహ్రెయిన్ చిన్నారి అల్‌జైన్ తారిఖ్ సంచలనం
కజాన్ (రష్యా): చాలామంది చిన్నారులు ఈత కొలనులోకి దిగేందుకు తటపటాయించే వయస్సులోనే ఆ చిన్నారి ఏకంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగింది. మేటి స్విమ్మర్లతో పోటీపడింది. తన ఈవెంట్‌లో అందరికంటే ఆఖరున నిలిచినప్పటికీ అందరి మనస్సులను గెలుచుకుంది. ఆ చిన్నారి ఎవరోకాదు బహ్రెయిన్‌కు చెందిన 10 ఏళ్ల అల్‌జైన్ తారిఖ్. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్ తొలి హీట్స్‌లో బరిలోకి దిగడంద్వారా అల్‌జైన్ తారిఖ్... ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పోటీపడిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. తన రేసును 41.13 సెకన్లలో ముగించిన అల్‌జైన్ 64 మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో చివరి స్థానంలో నిలిచింది.
‘ఇంతమంది ప్రేక్షకుల సమక్షంలో గతంలో ఎప్పుడూ స్విమ్మింగ్ చేయలేదు. దాంతో పోటీకి సిద్ధమయ్యేందుకు వస్తున్న సమయంలో కాస్త గాబరా కలిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడమే నా లక్ష్యం. నేనెంతో అభిమానించే మేటి స్విమ్మర్లతో ఇక్కడ ఫొటోలు దిగాను. వారి నుంచి మెళకువలను నేర్చుకుంటాను’ అని నాలుగేళ్ల ప్రాయంలో స్విమ్మింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన అల్‌జైన్ తెలిపింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు కనీస వయసు నిబంధనను ఇటీవలే అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (ఫినా) తొలగించడంతో అల్‌జైన్‌కు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం లభించింది.
అండర్-12 విభాగంలో బహ్రెయిన్ నంబర్‌వన్‌గా ఉన్నందుకు అల్‌జైన్‌ను ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఆమె కోచ్ ఎంపిక చేశారు. అల్‌జైన్ తల్లి స్కాట్లాండ్ దేశీయురాలు కాగా... తండ్రి తారిఖ్ సలీమ్ బహ్రెయిన్‌కు చెందినవారు. ‘అల్‌జైన్ వారంలో ఐదు రోజులు శిక్షణ తీసుకుంటుంది. యూఏఈ, ఖతార్, జోర్డాన్‌లలో జరిగిన అంతర్జాతీయ మీట్స్‌లో ఆమె బరిలోకి దిగింది. అల్‌జైన్‌కు 14 ఏళ్లు వచ్చాక మెరుగైన శిక్షణ కోసం బ్రిటన్‌కు మకాం మార్చే ఆలోచనలో ఉన్నాం’ అని తారిఖ్ తెలిపారు.