వైట్వాష్పై టీమిండియా గురి
హరారే: జింబాబ్వే పర్యటనలో రాణిస్తున్న భారత కుర్రాళ్లు మరో పోరుకు సిద్ధమయ్యారు. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా చివరి, మూడో మ్యాచ్లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మంగళవారం భారత్, జింబాబ్వేల మధ్య మూడే వన్డే జరగనుంది.
అజింక్యా రహానే సారథ్యంలోని భారత్ తొలి వన్డేలో చెమటోడ్చినా, రెండో వన్డేలో ఆల్రౌండ్ షోతో రాణించి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా తొలి మ్యాచ్లో సెంచరీతోనూ, రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం అంబటి రాయుడు గాయం కారణంగా జింబాబ్వే పర్యటన నుంచి వైదొలగడం కాస్త ప్రతికూలం. భారత బ్యాట్స్మెన్ గాడిలో పడటం కలిసొచ్చే అంశం. రెండో మ్యాచ్లో ఓపెనర్లు రహానె, మురళీ విజయం బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మిడిలార్డర్లోనూ రాణిస్తే బ్యాటింగ్ సమస్యలు తీరినట్టే. ఇక భారత బౌలర్లు సమష్టిగా రాణిస్తున్నారు. భారత్ ఇదే జోరు కొనసాగిస్తే క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేకాదు. ఇక జింబాబ్వే విషయానికొస్తే సొంతగడ్డపై సానుకూల పరిస్థితులను ఉపయోగించుకోలేకపోయింది. బ్యాటింగ్లో చిగుంబుర, మసకద్జ, చిబాబా.. బౌలింగ్లో మడ్విజా, టిరిపనో, విటోరి కీలకం.