బౌన్సర్లే ఎదురుదాడికి ప్రేరణ | Team India Run Machine Virat Kohli Interview Vivian Richards | Sakshi
Sakshi News home page

బౌన్సర్లే ఎదురుదాడికి ప్రేరణ

Published Thu, Aug 22 2019 10:05 PM | Last Updated on Thu, Aug 22 2019 10:05 PM

Team India Run Machine Virat Kohli Interview Vivian Richards - Sakshi

అంటిగ్వా: బౌలర్లపై ఎదురుదాడికి దిగేందుకు వారు వేసే బౌన్సర్లు తనకు ప్రేరణ ఇస్తాయని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి అన్నాడు. బౌన్సర్‌ తగులుతుందేమోనని బాధపడడం కన్నా.. నొప్పిని భరిస్తూనే బాదడం మేలని చెప్పాడు. వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌తో జరిగిన ముఖాముఖిలో కోహ్లి వెల్లడించిన అభిప్రాయాలివి. దీనికి సంబంధించిన తొలి భాగం వీడియోను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. 

ఇదంతా ఆటలో భాగమే
‘బౌన్సర్‌ ఎక్కడ గాయపరుస్తుందోనని భయపడే కన్నా ముందే దెబ్బ తగిలించుకోవడం మంచిదని అనుకుంటాను. అదీ గట్టిగా! మరోసారి అలా జరగకుండా ఇది నాకు ప్రేరణనిస్తుంది. శరీరమంతా ఆ నొప్పి పాకుతున్నప్పుడు.. సరే! మళ్లీ ఇది చోటుచేసుకోదు’ అని భావిస్తానని కోహ్లి చెప్పాడు. రిచర్డ్స్‌ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. ‘ఇదంతా ఆటలో ఒక భాగం. ఇలాంటి గాయాల తర్వాత మనమెలా తిరిగొస్తామన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. గతంలో ఛాతీ భాగంలో చిన్న గార్డ్స్‌ మాత్రమే ఉండేవి. బంతులు తగిలి బాధపడేవాళ్లం. కానీ తప్పదు’ అని రిచర్డ్స్‌ వెల్లడించారు. 

ప్రస్తుతం మాలాంటి బ్యాట్స్‌మెన్‌ అందరికీ మీరే గొప్ప స్ఫూర్తి అని విరాట్‌ చెప్పగా.. తమ ఇద్దరిలోని సారూప్యతలను రిచర్డ్స్‌ పేర్కొన్నాడు. ‘పోటీకి నేనెప్పుడూ సిద్ధమే అనుకొనేవాడిని. నా సామర్థ్యం మేరకు నన్ను నేను అత్యుత్తమంగా బయట పెట్టుకుంటాను. ఆ అభిరుచి, ఆ సారూపత్యను నీలో చూస్తున్నాను. కొన్నిసార్లు కొందరు మనల్ని భిన్నంగా చూస్తారు’ అని విండీస్‌ దిగ్గజం వెల్లడించాడు.

నేను గొప్పవాడినని నమ్మేవాడిని..
అత్యంత నాణ్యమైన బౌలింగ్‌ ఉన్నప్పటి శకంలో మీరెందుకు హెల్మెట్‌ ధరించలేదని కోహ్లి అడిగిన ప్రశ్నకు ‘నేను గొప్పవాడినని నమ్మేవాడిని. మీకు పొగరులా అనిపించొచ్చు. కానీ, నాకు తెలిసిన క్రీడలో భాగమయ్యానని ఫీలయ్యేవాడిని. ప్రతిసారీ నన్ను నేను ప్రోత్సహించుకొనేవాడిని. అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాలని భావించినప్పుడు దెబ్బలు తినడానికీ సిద్ధంగా ఉండేవాడిని. హెల్మెట్‌ ధరించినప్పుడు అసౌకర్యంగా ఉండేది.  మెరూన్‌ టోపీ ధరిచినప్పుడు గర్వంగా భావించేవాడిని. ఆడేందుకు నేను సరిపోతానన్న ఆలోచన ధోరణితో ఉండేవాడిని. ఒక వేళ నేను గాయపడితే అది దేవుడి దయ. క్షేమంగా బయటపడేవాడిని’ అని రిచర్డ్స్‌ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement