న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్‌లలో కొన్ని జట్లు అనుసరిస్తున్న ఫీల్డింగ్ వ్యూహాలను మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ కైఫ్ తప్పు పట్టాడు. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లలో మందకొడిగా ఫీల్డింగ్ చేసేవారు ఎవరైనా ఉంటే వారి స్థానాల్లో కావాలని చురుకైన ఫీల్డర్లను తీసుకొస్తున్నారని... తగిన కారణం లేకుండా సబ్‌స్టిట్యూట్‌లను వాడుకోవడం సరైంది కాదని కైఫ్ వ్యాఖ్యానించాడు. దీనిపై అంపైర్లు దృష్టి పెట్టాలని, లేదంటే తామే వారికి ఫిర్యాదు చేస్తామని అతను అన్నాడు. ‘కోల్‌కతాతో మ్యాచ్‌లో రసెల్ స్థానంలో రింకూ సింగ్ వచ్చాడు. చావ్లా వేగంగా తన నాలుగు ఓవర్లను పూర్తి చేసుకొని బయటకు వెళ్లిపోతే మళ్లీ రింకూ సింగ్ బరిలోకి దిగాడు.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సర్ఫరాజ్ గాయం గురించి నాకు స్పష్టత లేదు కానీ అతని స్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ అద్భుతమైన క్యాచ్ అందుకొని మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు. నెమ్మదిగా కదిలే ఆటగాళ్ల స్థానంలో చురుకైన ఫీల్డర్లను తెచ్చి ఆయా జట్లు తెలివిగా వ్యవహరించాయని భావిస్తున్నాయి. అయితే నా దృష్టిలో అది తప్పు. దీనిని ఇకపై అంపైర్ల దృష్టికి తీసుకెళతాం’ అని కైఫ్ చెప్పాడు. మరో వైపు ఫీల్డింగ్ చేస్తున్న జట్లు వ్యూహాలు రూపొందించడంలో చాలా సమయాన్ని వృథా చేస్తున్నాయని, నిజానికి అంత అవసరం లేదని అతను అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment