
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. కోవిడ్-19 సృష్టించిన సంక్షోభంతో అన్ని రంగాలతో పాటు క్రీడా రంగమూ కుదేలైంది. చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ వాయిదా పడింది. భారత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ టోర్నీకి అదే గతి పట్టింది. ఏప్రిల్ 15న మొదలు కావాల్సిన ఐపీఎల్ వాయిదా పడగా.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటివరకు బీసీసీఐ ప్రకటించలేదు. ఈక్రమంలో భారత టెస్టు ఆటగాడు చతేశ్వర్ పుజారా లాక్‌డౌన్ సంకట స్థితిని ఎలా ఎదుర్కొంటున్నాడో మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు.
(చదవండి: కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?)
‘భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్ సరైన సమయంలో తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. లాక్‌డౌన్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్నా. కీలకమైన లాక్‌డౌన్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరగా తీసుకుంది. లేదంటే అమెరికాలో తలెత్తిన పరిస్థితులు మనకూ ఎదురయ్యేవి కావొచ్చు. మనది అధిక జనభా గల దేశం. లాక్‌డౌన్‌తో మాత్రమే మనం వైరస్‌ను ఎదుర్కోగలం. అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి ఇళ్లల్లోనే ఉండండి. ఒక ఆటగాడిగా లాక్‌డౌన్‌తో నాకూ ఇబ్బందులు తప్పవు. కానీ, తప్పదు. సానుకూలంగా ఆలోచించి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇళ్లల్లోనే ఉండి ప్రజలు ఇన్నోవేటివ్‌గా ఆలోచించండి. ఇదివరకు చేయని పనులు చేయండి. కుంటుంబంతో ఎక్కువ సమయం గడపండి. నేనైతే పూర్తి సమయం కుటుంబానికే కేటాయించా. వారికి నా వంతు సాయం చేస్తున్నా. నా రెండేళ్ల కూతురు అదితితోనే రోజంతా గడిచిపోతోంది. చాలా బిజీ అయిపోయాం ఇద్దరం. చిన్నారిని ఫొటోలు తీయడం.. ఆమెతో ఆడుకోవడంతో తెగ సంబరపడిపోతోంది. మామూలుగా అయితే ఆమెకు నేను అందుబాటులో ఉండను.
అన్నీ నా భార్యే చూసుకుంటుంది. ఇప్పుడు టైం దొరికింది. చిన్నారి అదితి చాలా హ్యాపీగా ఉందిప్పుడు. ఐసోలేషన్‌లో ఉండటం సమస్యగా భావించకూడదు. ఏదేనీ పరిస్థితుల్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చినా కూడా నాకు బోర్ అనిపించదు. బుక్స్ చదవడంతో కాలక్షేపం చేస్తా. లాక్‌డౌన్‌తో టోర్నీలు లేకపోవడంతో అభిమానులకూ నిరాశ తప్పదు. కానీ, ఈ విపత్కర పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు దొరికిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని.. కొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగుతారు’అని పుజారా చెప్పుకొచ్చాడు.
(చదవండి: లాక్‌డౌన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు!)
(చదవండి: ‘నా శైలి అందరికీ తెలుసు’)
Comments
Please login to add a commentAdd a comment