జడేజా బ్యాటుసాము
భారత గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే సహజంగానే స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారనేది అందరికీ తెలిసిందే. ఈ టెస్టుకు ముందు దీనిపై కూడా పెద్ద చర్చే జరిగింది. మన జట్టులో వరల్డ్ నంబర్ 1, నంబర్ 2 స్పిన్నర్లు ఉన్నా... ఈ విభాగంలో మాత్రం బంగ్లాదేశ్ కూడా పోటీనివ్వగలదని అంతా అంచనా వేశారు. సుదీర్ఘ కాలంగా బంగ్లా జట్టు మూల స్థంభంలా ఉన్న షకీబ్‌తో పాటు కొత్తగా వెలుగులోకి వచ్చిన మెహదీ హసన్ మిరాజ్ కూడా ఆకట్టుకోగలడని అనుకున్నారు. పాపం... బంగ్లా కూడా అదే ఆశించింది. కానీ బలమైన భారత బ్యాట్స్‌మెన్ ముందు వారి ఆటలు ఏమాత్రం సాగలేదు.
రెండు రోజుల్లో కలిపి 24 ఓవర్లకే పరిమితమైన షకీబ్ ఒక్క వికెట్ కూడా తీయకుండా, భారీగా పరుగులిచ్చుకోగా... మెహదీ అయితే 42 ఓవర్లలో ఒక్క మెయిడిన్ కూడా వేయలేకపోయాడంటే మన బ్యాట్స్‌మెన్ ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతోంది. రెండో రోజు స్పిన్నర్లు మొత్తం 63 ఓవర్లు వేస్తే 236 పరుగులు రాబట్టిన భారత్, పేసర్లు వేసిన 13 ఓవర్లలోనే ఏకంగా 95 పరుగులు కొల్లగొట్టింది. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు, మరో రెండు అర్ధసెంచరీలతో భారత్ ప్రత్యర్థిని పూర్తిగా తొక్కేసింది. 166 ఓవర్ల మారథాన్ ఇన్నింగ్స్‌లో ఏ దశలోనూ మన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడలేదు. రెండో రోజైతే మరీ అలవోకగా, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. అశ్విన్ జోరు చూస్తే అతను కూడా మరో భారీ స్కోరు చేస్తాడని అనిపించింది. కోహ్లి, రహానేల 222 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీయడానికి బంగ్లాకు 50 ఓవర్లు పట్టాయి. అక్కడే ఆశలు కోల్పోయిన ఆ జట్టు తర్వాతి బ్యాట్స్‌మెన్ దెబ్బకు మరింత కుదేలైంది. ఇటీవలే ఇరానీ కప్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన వృద్ధిమాన్ సాహా ఇక్కడా తన ఫామ్‌ను కొనసాగించాడు.
అయితే సాహా నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్ చేయకుండా బంగ్లాదేశ్ చేసిన పుణ్యంతో అతను సెంచరీ దాకా చేరా>డు. కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే తమకు ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి బ్యాటింగ్‌లో ఎవరో ఒక బెంగాలీ అయితే సెంచరీ చేశాడని ఆ జట్టు సంతృప్తి పడుతుందేమో!రెండో రోజు భారత్‌కు బ్యాటింగ్‌లోనే కాదు ఉన్న కాసేపట్లో బౌలింగ్ కూడా కలిసొచ్చింది. డీఆర్‌ఎస్ అయితే మ్యాచ్ ఆరంభం నుంచి మన పక్షానే ఉంది. ఉమేశ్ విసిరిన 142 కిలోమీటర్ల బంతిని సర్కార్ ఆడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన సమయంలో ఎవరూ పెద్ద నమ్మకంతో లేరు. దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న పుజారా మాత్రం కాస్త ఆశగా చెప్పడంతో సందేహంతో కోహ్లి రివ్యూ కోరాడు. కానీ రీప్లేలో అలా బ్యాట్‌కు తాకుతూ బంతి వెళ్లిందని తేలడంతో శుక్రవారం టీమిండియా మరింత సంతోషంగా ఆటను ముగించింది. –సాక్షి, హైదరాబాద్
1 వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌లలో ‘డబుల్ సెంచరీ’ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. గతంలో బ్రాడ్‌మన్, ద్రవిడ్ వరుసగా మూడు సిరీస్‌లలో ‘డబుల్’ బాదారు. వెస్టిండీస్‌లో మొదలు పెట్టి న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లపై కోహ్లి ద్విశతకం సాధించాడు. కోహ్లికి ముందు భారత కెప్టెన్లందరూ కలిపి 4 డబుల్ సెంచరీలు నమోదు చేస్తే, కోహ్లి ఒక్కడే నాలుగు డబుల్ సెంచరీలు చేయడం మరో విశేషం.
1 సొంతగడ్డపై ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా కోహ్లి (1,168) సొంతం చేసుకున్నాడు. గతంలో సెహ్వాగ్ (1,105) పేరిట ఉన్న రికార్డును అతను అధిగమించాడు.
1 వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో కూడా 600కుపైగా పరుగులు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ముంబై, చెన్నైలలో ఇంగ్లండ్‌పై భారత్ 600కు పైగా స్కోరు సాధించింది.