కూలీ కొడుకు కోటీశ్వరుడయ్యాడు..
బెంగళూరు: ఈసారి ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు ఎంత ధర పలికింది. భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఎందుకు ఆసక్తి కనబరచలేదు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ తైమాన్ మిల్స్ కు అంత ధర పలకడమేమిటి అనే దానిపైనే ప్రధానంగా చర్చసాగింది. దాంతో పాటు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని భారత ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, ప్రజ్ఞాన్ ఓజాలు కూడా ఆ తరువాత వార్తల్లో నిలిచారు. కానీ.. ఐపీఎల్ వేలం ద్వారా రాత్రికి రాత్రి కొంతమంది అనామక క్రికెటర్లు సైతం కోటీశ్వరలయ్యారు. అందులో తంగరాసు నటరాజన్ ఒకడు. తమిళనాడుకు చెందిన ఈ పేసర్ ను కింగ్స్ పంజాబ్ అత్యధిక మొత్తం పెట్టి దక్కించుకుంది.
నటరాజన్ కనీస ధర రూ.10 లక్షలు ఉంటే అతన్ని రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కింగ్స్ పంజాబ్. తమిళనాడు జట్టులో నిలకడకు మారుపేరైన నటరాజన్ పై కింగ్స్ పంజాబ్ మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ విపరీతమైన ఆసక్తి కనబరిచడమే ఆ యువ బౌలర్ కు 30 రెట్లు అధిక ధర చెల్లించడానికి కారణమైంది. ఈ 25 ఏళ్ల యువ క్రికెటర్ ను దక్కించుకోవడానిక పలు ఫ్రాంచైజీలు పోటీ పడినప్పటికీ చివరకు అతన్ని కింగ్స్ పంజాబ్ దక్కించుకుంది.
తమిళనాడుకు చెందిన నటరాజన్ ఓ రైల్వే కూలీ కొడుకు . నటరాజన్ వయసు 20 ఏళ్లప్పుడు అతని తల్లి ఓ స్టాల్ ను నిర్వహించగా, తండ్రి మాత్రం రోజు వారీ రైల్వే కూలీగా పని చేసేవాడు. అతని స్వస్థలం సాలెంలో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ను ఎక్కువగా ఆడేవాడు. ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీ చెన్పైకు షిష్ట్ కావాల్సి వచ్చింది. చెన్నైలోని జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్లో సభ్యత్వం తీసుకున్న నటరాజన్ కు అక్కడే భారత ప్రధాన క్రికెటర్లు అశ్విన్, మురళీ విజయ్లతో పరిచయమైంది. ఇక్కడ నటరాజన్ ప్రతిభను అశ్విన్, మురళీ విజయ్లు గుర్తించారు. అతనికి తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) తరుపున ఆడే అవకాశం కూడా అశ్విన్, మురళీ ద్వారానే దక్కింది. ఇక్కడ నిలకడైన ప్రదర్శన చేసిన నటరాజన్ తమిళనాడు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. దాంతో అతనికి 2015-16ల్లో రాష్ట్ర రంజీ జట్టు తరపున ఆడేందుకు పిలుపు వచ్చింది.
ఇక అక్కడ నుంచి తన శ్రమనే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగాడు నటరాజన్. ఇప్పుడు ఐపీఎల్ -10సీజన్ ల్లో బరిలోకి దిగుతుండటంతో నటరాజన్ పై అందరి దృష్టి ఉంది. ఇప్పటివరకూ ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ క్రికెటర్ ఎలా రాణిస్తాడో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రధానంగా కింగ్స్ పంజాబ్ నటరాజన్ పై భారీ ఆశల్నేపెట్టుకుంది. మరి ఆ ఆశల్ని నటరాజన్ నిజం చేస్తాడో లేదో చూడాలి.
మిచెల్ జాన్సన్ ఆదర్శం
ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సనే తనకు ఆదర్శం అంటున్నాడు నటరాజన్. అతని బౌలింగ్ అంటే తనకు విపరీతమైన ఇష్టమని పేర్కొన్నాడు. అతని బౌలింగ్ వీడియోలు ఎక్కువగా చూస్తూ ఉంటానన్నాడు. తాను కూడా ఎడమ చేతి బౌలింగ్ వాటం కావడం అతనిపై మక్కువ పెరగడానికి కారణంగా నటరాజన్ చెప్పుకొచ్చాడు. ఈ ఐపీఎల్ ద్వారా అతన్ని కలిసే అవకాశం దక్కుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.దాంతో పాటు తన ఉన్నతికి కారణమైన అశ్విన్, విజయ్ లతో పాటు, తమిళనాడు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలకు ధన్యవాదాలు తెలియజేశాడు. తాను అసలు టీఎన్పీఎల్లో ఆడతానని అనుకోలేదని, అయితే ప్రస్తుతం ఇక్కడ వరకూ రావడం తనకు సరికొత్త అనుభూతిగా ఉందని నటరాజన్ పేర్కొన్నాడు.