
ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది: మనీష్
హరారే : భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఆ క్షణం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీష్ పాండే అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో మూడో వన్డేలో తొలిసారి బరిలోకి దిగిన మనీష్‌కు సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ క్యాప్ అందించాడు. ‘భారత జట్టుకు ఆడాలన్నది నా కల. అది ఇప్పుడు నెరవేరింది. చాలాకాలంపాటు జట్టులో అవకాశం కోసం ఎదురుచూశా. ఇప్పుడు దాన్ని సాధించా. చాలా సంతోషంగా ఉంది. భజ్జీ క్యాప్ ఇచ్చిన తర్వాత ఆనందంతో దాన్ని ముద్దుపెట్టుకున్నా.
ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేక క్షణాలు ఉంటాయి. నేను క్యాప్ అందుకున్న క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని మనీష్ పేర్కొన్నాడు. టీమిండియాకు ఎంపిక కావడం తన తల్లిదండ్రులు, తనతో పాటు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారందరి కల అని చెప్పాడు. దేశవాళీలో ఆడిన అనుభవం ఉండటం వల్ల తొలి వన్డేలో పెద్దగా ఒత్తిడికి గురికాలేదన్నాడు. మ్యాచ్ కోసం ముందునుంచే సన్నద్ధమయ్యానని తెలిపాడు. జట్టులో చోటు సుస్థిరం చేసుకోవడానికి కష్టపడతానని చెప్పాడు.