జింఖానా, న్యూస్‌లైన్: ఎడ్డీ ఐబరా అండర్-19 వన్డే నాకౌట్ టోర్నీలో వెస్లీ జూనియర్ కాలేజి విజేతగా నిలిచింది. భవాన్స్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్లీ బ్యాట్స్‌మన్ రాహుల్ (91 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన భవాన్స్ 168 పరుగుల వద్ద ఆలౌటైంది.
జట్టులో వికాస్ బిల్లా (50) అర్ధ సెంచరీతో రాణించగా.. నఫీజ్ 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. వెస్లీ బౌలర్స్ ప్రణీత్, చందన్, శ్రీకాంత్, నవీన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్లీ జట్టు నాలుగు వికెట్లకు 170 పరుగులు చేసింది. చైతన్య 47 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. భవాన్స్ బౌలర్ నరేష్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్‌లో తొలి రోజు వరంగల్ జట్టు 227 పరుగులు చేసింది.
జట్టులో ఫరూఖ్ (74), శరత్ యాదవ్ (47) రాణించారు. ఆదిలాబాద్ బౌలర్ రాకేష్ అత్యధికంగా 7 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తర్వాత బరిలోకి దిగిన ఆదిలాబాద్ జట్టు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రమేష్ యాదవ్ (74) అర్ధ సెంచరీతో విజృంభించగా.. లఖ్మణ్ (31 నాటౌట్), వినోద్ (42 నాటౌట్) బరిలో ఉన్నారు. వరంగల్ బౌలర్ ఫరూఖ్ నాలుగు వికెట్ల్లు చేజిక్కించుకున్నాడు.
విజేత వెస్లీ కాలేజి
Published Sun, Oct 6 2013 12:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement