
దీపిక గురి అదిరింది
► 686 పాయింట్లతో ప్రపంచ రికార్డు సమం
► వరల్డ్ కప్ ఆర్చరీ
షాంఘై (చైనా): కొత్త సీజన్‌ను భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపిక కుమారి ఘనంగా ప్రారంభించింది. ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్-1 టోర్నమెంట్‌లో దీపిక క్వాలిఫయింగ్ రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ రికార్డును సమం చేసింది. 72 బాణాలు సంధించిన దీపిక 686 పాయింట్లు స్కోరు చేసి క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌ను సంపాదించింది. ఈ క్రమంలో లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కీ బో బే (దక్షిణ కొరియా) పేరిట 686 పాయింట్లతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ జార్ఖండ్ అమ్మాయి అందుకుంది.
దీపిక ప్రదర్శనతో ఆమెకు నేరుగా మూడో రౌండ్‌లోకి ‘బై’ లభించింది. క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్‌లో భారత్‌కే చెందిన బొంబేలా దేవి 645 పాయింట్లతో 34వ స్థానంలో... లక్ష్మీరాణి మాఝీ 638 పాయింట్లతో 45వ స్థానంలో... రిమిల్ బురిలీ 612 పాయింట్లతో 75వ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురూ తొలి రౌండ్ మ్యాచ్‌లను ఆడతారు. మిక్స్‌డ్ విభాగంలో దీపిక కుమారి-అతాను దాస్ ద్వయం కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.
క్వార్టర్ ఫైనల్లో దీపిక-అతాను జంట 5-3తో టర్కీ జోడీని ఓడించగా... సెమీస్‌లో 3-5తో చైనీస్ తైపీ ద్వయం చేతిలో ఓడి కాంస్య పతక మ్యాచ్‌లో కొరియా జంటతో పోరుకు సిద్ధమైంది. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌లో అతాను దాస్ 12వ, జయంత తాలుక్‌దార్ 13వ, మంగళ్ సింగ్ చంపియా 20వ స్థానంలో నిలిచారు.