
వినడానికి విచిత్రంగా... చెప్పుకోవడానికి ఆశ్చర్యకరంగా అనిపించే ఘటనలు ఇటీవల క్రికెట్‌లో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి ఆటగాళ్ల మధ్యనో... మైదానంలోని ప్రేక్షకుల కారణంగానో అయితే పెద్దగా ప్రాధాన్యం ఉండకపోయేది. కానీ, ఆటకు ఆయువుపట్టయిన అంపైరింగ్ వ్యవస్థలో తలెత్తుతుండటంతో చర్చనీయాంశం అవుతున్నాయి.
మ్యాచ్ ఫలితంపై అంతోఇంతో ప్రభావం చూపుతూనే... ఒక్కోసారి వివాదానికి సైతం దారితీస్తూ ‘జెంటిల్మన్’ గేమ్ స్ఫూర్తిని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వివిధ జట్ల మధ్య జరిగిన గత ఐదారు సిరీస్‌లను పరిశీలిస్తే అంపైరింగ్ పొర‘పాట్లు’ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది.
సాక్షి క్రీడా విభాగం
ఏదైనా అనుమానం వస్తే సంప్రదించేందుకు సహచర అంపైర్ ఉన్నాడు... అప్పటికీ సంశయం ఉంటే నివృత్తికి థర్డ్ అంపైర్‌కు నివేదించే వీలుంది... ఆపై తేల్చేందుకు టెక్నాలజీ తోడుంది! ఇన్ని పటిష్ట ఏర్పాట్లు చేసుకున్నా ఇటీవల అంపైరింగ్‌లో పదేపదే పొరపాట్లు దొర్లుతున్నాయి. ఇలాంటివి ఒకటీ, అరా అయితే చూసీచూడనట్లు వదిలేయొచ్చు. అప్పుడప్పుడు అంటే మానవ తప్పిదమని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సిరీస్‌లలో తలెత్తుతుండటంతో ప్రమాణాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓ దశలో సహనం కోల్పోయిన ఆటగాళ్లు నిలదీసే వరకు వెళ్తున్నాయి. ఈ ఆవేశంలో అనుకోకుండా హద్దు మీరితే మొదట చర్యలకు గురయ్యేది క్రికెటర్లే కావడం గమనార్హం.
విచక్షణతో వదిలేశారు...
ప్రతి అంశానికీ టెక్నాలజీ వైపు చూస్తున్న ఈ రోజుల్లోనూ అంపైరింగ్ దోషాలంటే అవి ఆటగాళ్ల పాలిట గ్రహపాట్లుగానే భావించాలి. ఓవైపు టెస్టుల్లో పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా వదిలేయాల్సిన ‘స్లో ఓవర్ రేట్’కే మ్యాచ్‌లకు మ్యాచ్‌లు నిషేధం విధిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... మైదానంలో అదుపు తప్పిన ఆటగాళ్లను అన్నిసార్లు ఊరకనే వదిలేస్తుందని అనుకోలేం. ఉదాహరణకు డిసెంబరులో బంగ్లాదేశ్‌పై మూడో టి20లో ఒషేన్ థామస్ వేసిన ఓ బంతిని ‘నో బాల్’గా ప్రకటించడంపై వెస్టిండీస్ కెప్టెన్ కార్లొస్ బ్రాత్‌వైట్ అంపైర్ తన్వీర్ అహ్మద్‌తో తీవ్రమైన వాదనకు దిగాడు. ఈ వివాదం కారణంగా మ్యాచ్ 8 నిమిషాలు ఆగింది. వాస్తవానికి థామస్‌ది ‘నో బాల్’ కాదు. దీంతో బ్రాత్‌వైట్‌పై చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఇదే సిరీస్ రెండో టి20లో స్లో ఓవర్ రేట్‌కు బ్రాత్‌వైట్ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.
అక్కడ... ఇక్కడ... ఎక్కడైనా!
సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో భారత్–అఫ్గానిస్తాన్ వన్డేలో, భారత్–న్యూజిలాండ్ రెండో టి20లో, ఇంగ్లండ్–వెస్టిండీస్ టెస్టులో, ప్రస్తుత శ్రీలంక–దక్షిణాఫ్రికా టెస్టులో అంపైరింగ్ తప్పటడుగులు సాధారణమయ్యాయి. కొత్తవారంటే తడబడ్డారని అనుకున్నా, వందలకొద్దీ మ్యాచ్‌లను పర్యవేక్షించిన అలీమ్ దార్ వంటి సీనియర్ల నిర్ణయాలు సైతం వేలెత్తిచూపేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో చూపాల్సిన ‘సమయ’స్ఫూర్తి వారిలో కొరవడుతోంది. దీంతో పని భారం తగ్గింపు, నిర్ణయాల్లో కచ్చితత్వం కోసమంటూ తీసుకొచ్చిన సాంకేతికతకూ విలువ లేకుండా పోతోంది. ‘అంపైరింగ్ నిర్ణయాలను ప్రశ్నించి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుని మ్యాచ్ నిషేధాలను ఎదుర్కోవడం ఇష్టం లేదంటూ’ ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై మ్యాచ్‌కు భారత కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని వ్యాఖ్యానించాడు. ధోని మాటల అంతరార్థం... అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందరికీ తెలిసిపోయింది.
సాఫ్ట్ సిగ్నల్ ఎత్తివేయండి...
డీఆర్‌ఎస్‌లోనూ ఏమీ తేలని పక్షంలో... అంపైర్ తొలుత ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉండే సాఫ్ట్ సిగ్నల్‌ను ఎత్తివేయాలని క్రికెట్ ప్రముఖుల నుంచి బలమైన డిమాండ్ వస్తోంది. కొన్నిసార్లు మైదానంలో ఆటగాళ్ల సంబరాలకు ప్రభావితులై అంపైర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాంటపుడు తుది నిర్ణయాన్ని వారికే ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ... అంపైరాంగ్ ఘటనలు!
ఇంగ్లండ్–వెస్టిండీస్ మూడో టెస్టు తొలి రోజు అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయిన బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అయితే అంపైర్ పరిశీలించి జోసెఫ్ ‘నో బాల్’ వేసినట్లు తేల్చి వెనక్కుపిల్చాడు. కానీ, అప్పటికే బెయిర్‌స్టో గ్రౌండ్‌లోకి వచ్చేశాడు. 2017 ఏప్రిల్ నుంచి మారిన రూల్ నంబర్ 31.7 ప్రకారం... ఔట్‌గా వెళ్లిపోయిన బ్యాట్స్‌మన్‌ను మరుసటి బంతి పడేవరకు వెనక్కు పిలిచే అధికారం అంపైర్లకు ఉంది. దీంతో స్టోక్స్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు అనుమతించారు.
►భారత్‌పై రెండో టి20లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డరైల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూ వివాదం రేపింది. దీనిపై నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)కి వెళ్లగా హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టమైంది. అయితే, బంతి ట్రాకింగ్‌లో మూడు ఎరుపు గుర్తులు కనిపించడంతో మూడో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
►డిసెంబరులో బంగ్లాదేశ్–వెస్టిండీస్ టి20లో ఒషేన్ థామస్ కాలు క్రీజ్‌కు తగులుతున్నా అంపైర్ తన్వీర్ అహ్మద్ నోబాల్ ఇచ్చాడు. పెద్ద వివాదం రేగడంతో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్తవాడినని, పొరపాటు చేశానని అతడు అంగీకరించాడు.
►శ్రీలంకతో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా స్పష్టంగా ఔటయినా అలీమ్ దార్ ఇవ్వలేదు. లంక కెప్టెన్ కరుణరత్నె డీఆర్‌ఎస్ కోరబోగా నిర్ణీత సమయం (15 సెకన్లు) అయిపోయిందంటూ దార్ తిరస్కరించాడు. కానీ, మరో రెండు సెకన్ల వ్యవధి మిగిలే ఉన్నట్లు తర్వాత తేలింది.
Comments
Please login to add a commentAdd a comment