కొత్త కొత్తగా ఉంది!
చాంపియన్స్ టెన్నిస్ లీగ్‌పై హింగిస్ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలం తర్వాత హైదరాబాద్ నగరం మరో చెప్పుకోదగ్గ టెన్నిస్ టోర్నీకి వేదిక అయింది. ఎల్బీ స్టేడియంలో నేడు, రేపు చాంపియన్స్ లీగ్ టెన్నిస్ టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరును ఎదుర్కొంటుంది. మంగళవారం పుణేతో హైదరాబాద్ తలపడుతుంది.
జోరుగా ప్రాక్టీస్...
ఆదివారం ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ ఏసెస్ ఆటగాళ్లు చాలా సేపు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత యువ ఆటగాళ్లతో మాజీ వరల్డ్ నంబర్‌వన్ మార్టినా హింగిస్ ముచ్చటించింది. చిన్నారులు తమ అభిమాన ప్లేయర్లతో ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అనంతరం ఏసెస్ జట్టు యజమానులు రాజేశ్, కృష్ణంరాజులతో కలిసి ఆటగాళ్లు మీడియాతో మాట్లాడారు.
‘చాంపియన్స్ టెన్నిస్ లీగ్ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఆటతో పాటు అనేక మంది మాజీ సహచరులను కలిసే అవకాశం కూడా దక్కుతోంది. ఫార్మాట్ కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఫిలిప్పోసిస్‌తో నేను గతంలోనూ మిక్స్‌డ్ డబుల్స్ ఆడాను’ అని హింగిస్ వ్యాఖ్యానించింది. భారత వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. ‘మ్యాచ్‌కు దాదాపు నాలుగు వేల మంది ప్రేక్షకులు వస్తారని విన్నాను. హోంగ్రౌండ్‌లో ప్రేక్షకులు మాకు మద్దతిస్తారని ఆశిస్తున్నాను.
ఇవాళ ప్రాక్టీస్ కూడా కొత్తగా అనిపించింది. ఇంత మంది మధ్య నేనెప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు’ అని హింగిస్ వెల్లడించింది. ఏసెస్‌ను విజేతగా నిలబెడతామని ఈ సందర్భంగా ఫిలిప్పోసిస్ విశ్వాసం వ్యక్తం చేశాడు. యూజ్నీ తనదైన శైలిలో సెల్యూట్ చేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
హౌస్‌ఫుల్...
సోమ, మంగళవారాల్లో ఇక్కడ జరిగే సీటీఎల్ టోర్నీ మ్యాచ్‌ల కోసం టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. ‘బుక్ మై షో’ ద్వారా ఆన్‌లైన్ అమ్మకాలకు మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ సర్క్యూట్‌లో రెగ్యులర్ ఆటగాళ్లు కాకపోయినా, గతంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టెన్నిస్ స్టార్లు ఈ బరిలోకి దిగుతుండటంతో ఈ టోర్నీ పట్ల ఆసక్తి నెలకొంది. ఎల్బీ స్టేడియంలో చాలా కాలంగా పెద్దగా మ్యాచ్‌లు జరగని సెంటర్ కోర్టును సీటీఎల్ కోసం ఉపయోగించనున్నారు. ఇందు కోసం అపరిశుభ్రంగా ఉన్న కోర్టులను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్ది సిద్ధం చేశారు.
నేటి మ్యాచ్‌లో ఎవరితో ఎవరు...
లెజెండ్స్: ఫిలిప్పోసిస్ ఁ ఎన్‌క్విస్ట్
మిక్స్‌డ్ డబుల్స్:
హింగిస్, యూజ్నీ ఁ వీనస్ విలియమ్స్, లోపెజ్
మహిళల సింగిల్స్: హింగిస్ ఁ వీనస్
పురుషుల డబుల్స్: యూజ్నీ, జీవన్ ఁ లోపెజ్, రామ్‌కుమార్ రామనాథన్
పురుషుల సింగిల్స్: యూజ్నీ ఁ లోపెజ్.