న్యూఢిల్లీ: భారతదేశంలో దురదృష్టవశాత్తూ సరైన క్రీడా సంస్కృతి లేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సరిగ్గా చెప్పాలంటే మన సమాజంలో ఎక్కువ మందికి క్రీడలపై కనీస పరిజ్ఞానం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కొందరిని క్రీడల్లో ప్రోత్సహించే దిశలో జరిగిన ఘటనలు దీనికి నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. తన సహచర పార్లమెంట్ సభ్యులకు కూడా ఆటలంటే అవగాహన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కోవిడ్ సమయంలో తండ్రిని రిక్షాలో కూర్చొబెట్టుకొని 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన జ్యోతి కుమారి, గ్రామీణ క్రీడల్లో ఆకట్టుకున్న శ్రీనివాస గౌడ, రమేశ్ గుర్జర్‌ల ఉదాహరణలు చూడండి.
ఆ అమ్మాయిది నిజానికి విషాదం. కానీ నా తోటి ఎంపీలు ఆమె సైక్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధిస్తుందని చెప్పారు. అసలు సైక్లింగ్‌లో ఎన్ని ఫార్మాట్‌లు ఉంటాయి. ఒలింపిక్ పతకం గెలవాలంటే ఏం చేయాలో వారికి తెలుసా? ఏదో చదివింది చెప్పేస్తుంటారు. ఎద్దులతో కలిసి పరుగెత్తిన శ్రీనివాస్ కూడా ప్రొఫెషనల్ అథ్లెట్ అయ్యే అవకాశం లేదని నాకు నిపుణులు చెప్పారు. కానీ కొందరేమో బోల్ట్‌తో పోల్చడం మొదలు పెట్టారు. ఎక్కువ శాతం మందికి క్రీడల గురించి ఏమాత్రం తెలీదని మనకు అర్థమవుతుంది. దీనిని మార్చాల్సిన అవసరం ఉంది’ అని రిజిజు విశ్లేషించారు. ఒలింపిక్స్‌లో ఎప్పుడో ఒకసారి సాధించే విజయాలకు పొంగిపోయి సంబరాలతో సరిపెట్టకుండా అలాంటి విజయాలు మళ్లీ మళ్లీ సాధించేలా ప్రయత్నించాలని రిజిజు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment