దుబాయ్: అండర్–19 ప్రపంచకప్‌కు ముందు భారత యువ ఆటగాళ్లు అసలైన రీతిలో సన్నద్ధమయ్యారు. ఆసియా స్థాయిలో చాంపి యన్‌గా నిలిచి కుర్రాళ్లు సత్తా చాటారు. శుక్రవారం ముగిసిన అండర్–19 ఆసియా కప్‌లో భారత్ టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక అండర్–19 జట్టును చిత్తు చేసింది. భారత అండర్–19 టీమ్ ఆసియా కప్‌ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేయగలిగింది. రోడ్రిగో (19 నాటౌట్)దే అత్యధిక స్కోరు. లంక స్కోరు 33 ఓవర్లకు 74/7 ఉన్నప్పుడు వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. దాంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. విరామం తర్వాత లంక తర్వాతి 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి మరో 32 పరుగులు చేసింది. భారత బౌలర్లలో విక్కీ ఒస్వాల్ 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, కౌశల్ తాంబేకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం ‘డక్‌వర్త్ లూయిస్’ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 102 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (5) ఆరంభంలోనే వెనుదిరిగినా... అంగ్రిష్ రఘువంశీ (67 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (49 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 96 పరుగులు జోడించారు. జనవరి 14 నుంచి వెస్టిండీస్ వేదికగా అండర్–19 ప్రపంచకప్ జరుగుతుంది. జనవరి 15న తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment